Tue Feb 24 2026 14:09:18 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh : నినాదం బీజేపీకి కలసి వస్తుందా? చంద్రబాబు, జగన్ లకు భవిష్యత్ లేదా?
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ ను ఒక కుదుపు కుదుపేస్తుంది.

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ ను ఒక కుదుపు కుదుపేస్తుంది. అధికార కూటమి ప్రభుత్వం దీనిని వదిలిపెట్టేటట్లు కనిపించడం లేదు. అయితే హిందూ ఓటు బ్యాంకును ఏకీకరణ చేయాలన్న లక్ష్యంతో కూటమి ఈ లడ్డూ వ్యవహారాన్ని నెత్తికెత్తుకుంది. అయితే రానున్న కాలంలో బీజేపీ బలపడేందుకు ఇది ఉపయోగపడుతుందన్న విశ్లేషణలు సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకూ కులాల రగడ తప్పించి మతాల రాద్ధాంత లేదన్నది వాస్తవం. అందుకే ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఎదుగుదలకు నోచుకోలేదు. టీడీపీతో పొత్తు పెట్టుకున్న సమయంలోనే కొన్ని సీట్లు తెచ్చుకుంది తప్పించి ఒంటరిగా పోటీ చేస్తే మాత్రం బీజేపీకి ఒక శాతం ఓటు కూడా రాదన్నది గత ఎన్నికల ఫలితాలు తేల్చి చెప్పాయి.
పరోక్షంగా బీజేపీ బలపడేందుకు...
ఇప్పుడు తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం బీజేపీకి పరోక్షంగా కలసి వచ్చేటట్లు కనిపిస్తుంది. అధికార కూటమిలోని టీడీపీ, జనసేనలు, ప్రతిపక్ష వైసీపీలు కలసి బీజేపీని బలోపేతం చేసేటట్లు కనిపిస్తుంది. అయితే ఇదే పంథాను తీసుకున్న కొన్ని ప్రాంతీయ పార్టీలు ఇతర రాష్ట్రాల్లో ఎలా అయిపోయాయో తెలుసుకుంటే మంచిదని కొందరు సోషల్ మీడియా వేదికగా సూచిస్తున్నారు. మహారాష్ట్రలో శివసేన మతం, ప్రాంతం ఆధారంగా వచ్చింది. బాల్ థాక్రే ఉన్నంత వరకూ బాగానే నడిచింది. ఇప్పుడు శివసేన పరిస్థితి ఏంటి? అన్న ప్రశ్న అందరిలోనూ కలుగుతుంది. అదే రేపు ఏపీలోనూ టీడీపీ, వైసీపీకి జరగదన్న గ్యారంటీ ఏమైనా ఉందా? అన్న అనుమానాలు కూడా అనేక మంది వ్యక్తం చేస్తున్నారు. అవును అందులో నిజమేనంటూ కామెంట్స్ కూడా పోస్టుల రూపంలో పెడుతున్నారు.
మతం ఊపందుకుంటే...
మతం అన్న నినాదం ఊపందుకున్నప్పుడు ఇక ఎటువంటి సంక్షేమ పథకాలు పనిచేయవు. క్వాంటం వాలీలు, డాటా సెంటర్లు కాపాడలేవు. బటన్ నొక్కాడాలు అన్నది చూడరు. కేవలం మతం ఆధారంగానే ఎన్నికలు జరిగే ప్రక్రియ ప్రారంభమయిన రోజు ప్రాంతీయ పార్టీలు కనుమరుగు అవ్వకతప్పదని అనేక రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలు సూచిస్తున్నాయని విశ్లేషకులు సయితం అభిప్రాయపడుతున్నారు. మహారాష్ట్రలో శివసేన తానే ఛాంపియన్, తానే కింగ్ మేకర్ అని విర్రవీగింది. ఇప్పుడు మొత్తం పార్టీ ఎక్కడుందో టీడీపీ, వైసీపీ చీఫ్ లు తెలుసుకుంటే మంచిదని సూచిస్తున్నారు. ఇప్పటికైనా మతం అన్నది కాకుండా ప్రజాప్రయోజనాలు, సమస్యలు, ఇతర అంశాలపై దృష్టి పెడితే కొంత భవిష్యత్ ఉంటుంది. లేకుంటే ఇతర రాష్ట్రాల్లో పట్టిన గతి ఇక్కడ టీడీపీ, వైసీపీలకు పడుతుందన్న దానిలో అతిశయోక్తి లేదన్నది వాస్తవం.
Next Story

