Fri Dec 05 2025 21:55:33 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో భక్తుల రద్దీతో అధికారులు ఏం చేశారంటే? ఈరోజు రాత్రితో
తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. వైకుంఠ ద్వార దర్శనాలకు చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమల వచ్చారు.

తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఆదివారం కావడంతో పాటు వైకుంఠ ద్వార దర్శనాలకు చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమల వచ్చారు. భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది వైకుంఠ ద్వార దర్శనానికి గతంలో ఎన్నడూ లేని విధంగా ఎక్కువ మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారని అధికారులు తెలిపారు. భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు ముందుగానే తీసుకున్నామని టీటీడీ అధికారులు తెలిపారు.
పన్నెండు గంటలకు...
ఈరోజు వైకుంఠ ద్వార దర్శనం చివరి రోజు కావడంతో అత్యధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. నేటి అర్థరాత్రి 12 గంటలకు వైకుంఠ ద్వారాలను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు మూసివేయనున్నారు. ఇప్పటి వరకూ వైకుంఠ ద్వార దర్శనాన్ని 6,12,208 మంది భక్తులు చేసుకున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఈ రోజుతో ఏడు లక్షలకు చేరుతుందని, గతంలో ఎన్నడూ లేని విధంగా ఏడు లక్షల మంది కేవలం పది రోజుల్లో వైకుంఠ ద్వార దర్శనాలు చేసుకున్నారని అధికారులు తెలిపారు.
ఐదు గంటలు...
రేపటి నుంచి సర్వదర్శనం క్యూ లైన్ లో భక్తులను అనుమతించనున్నారు. అయితే రేపు సిఫార్సు లేఖలను కూడా స్వీకరించమని టీటీడీ అధికారులు తెలిపారు. ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలను మాత్రం అందుబాటులో ఉంటాయని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. నిన్న తిరుమల శ్రీవారిని 75,931 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 25,717 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.40 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టోకెన్లు కలిగిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు గంటలు, టోకెన్లు లేని భక్తులకు ఐదు గంటలు సమయం పడుతుందని అధికారులు తెలిపారు.
Next Story

