Fri Dec 05 2025 11:35:21 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలకు పోటెత్తిన భక్తులు.. దర్శనానికి ఎంత సమయం అంటే?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. బుధవారం అయినా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. బుధవారం అయినా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. కంపార్ట్ మెంట్లు అన్నీ భక్తులతో నిండిపోయాయి. దాదాపు రెండు కిలోమీటర్ల వరకూ క్యూ లైన్ కొనసాగుతుంది. తిరుమలలోని శ్రీవారి దర్శనం కోసం భక్తులు పడిగాపులు పడుతున్నారు. గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో తిరుమలకు వచ్చిన ప్రతి భక్తుడికి సులువుగా దర్శనం కల్పిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రకటించారు. ఎవరూ ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని తెలిపారు.
రానున్న కాలంలో...
సాధారణంగా తిరుమలకు మంగళవారం నుంచి గురువారం భక్తుల రద్దీ తక్కువగా ఉంటుంది. కానీ గత కొద్ది రోజులుగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటూ వస్తుంది. ఇక తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతుండటంతో ఈ నెలాఖరు నుంచి తిరుమలకు భక్తులు పోటెత్తనున్నారు. వరస సెలవులు రావడంతో పాటు దసరా బ్రహ్మోత్సవాలకు హాజరై శ్రీనివాసుడిని కనులారా దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తారు. అందుకోసం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది.
రెండు కిలోమీటర్ల మేర...
ఈరోజు తిరుమలలోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బయట కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకూ భక్తుల క్యూ లైన్ లో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఏడు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం ఐదు గంటలకు పైగానే సమయం పడుతుంది. తిరుమల శ్రీవారిని నిన్న 63,607 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 23,856 మంది భక్తుల తిరుమల శ్రీవారికి తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.87 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

