Sun Feb 01 2026 04:52:01 GMT+0000 (Coordinated Universal Time)
Ap Budget : బడ్జెట్ లో వాటికి నిధులు కేటాయిస్తేనే జనం నమ్ముతారా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయడానికి ఇక సమయం ఆసన్నమయింది

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయడానికి ఇక సమయం ఆసన్నమయింది. ఇప్పటికే హామీల అమలులో ఆలస్యమయిందని జనం అసహనం ఫీలవుతున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను గ్రౌండ్ చేయడానికి నిధులు లక్షల కోట్ల రూపాయలు అవసరమవుతాయి. ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత పింఛను నాలుగు వేల రూపాయలకు పెంచిన మొత్తాన్ని ఠంచనుగా ఇస్తున్నారు. ఇక ఉచిత గ్యాస్ సిలిండర్ కూడా ఒక విడత మాత్రమే ఇచ్చారు. అంటే సూపర్ సిక్స్ హామీలలో ఇంకా చాలా మిగిలిపోయాయి. తాజాగా బడ్జెట్ సమావేశాల్లో వీటికి ఏ మేరకు నిధులు కేటాయిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
ఇచ్చిన హామీలను...
రాష్ట్ర బడ్జెట్ కూర్పుపై ఆర్థిక శాఖ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. అందుబాటులో ఉన్న నిధులు ఎంత? మనం ఎంత మేరకు బడ్జెట్ లో కేటాయింపులు చేయగలము అన్న దానిపై ఆయన ప్రధానంగా దృష్టి పెట్టినట్లు తెలిసింది. మరోవైపు ఆయనకు ప్రధానమైనది పోలవరం, అమరావతి నిర్మాణాలను ఈ టర్మ్ లోనే పూర్తి చేయడం. దానికి సంబంధించిన నిధులను వేరే వాటికి బదిల చేయబోమని ఖచ్చితంగా తేల్చిచెప్పారు. అదే సమయంలో తాను ఇచ్చిన హామీలను విడతల వారీగా అమలు చేస్తామని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఉగాది నుంచి అమలు చేస్తామని తెలిపారు. దీనికే నెలకు నాలుగు వందల కోట్ల రూపాయలు వ్యయం అయ్యే అవకాశాలున్నాయి. దీంతో పాటు కొత్త బస్సుల కొనుగోలు, అదనపు సిబ్బంది నియామకం కూడా ప్రభుత్వ ఖజానాపై భారం పడనుంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏర్పాటయి తొమ్మిది నెలలు కావస్తుండటంతో ఈ బడ్జెట్ లో నిధులకోసం ఆశగా జనం కూడా ఎదురు చూస్తున్నారు.
ఈ రెండు పథకాలే...
ఇక అన్నదాత సుఖీభవ పథకాన్ని కూడా మే నెలలో ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. రైతుల ఖాతాల్లో ఏడాదికి ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయం కింద అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయనున్నారు. అయితే ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం తరహాలోనే ఏడాదికి మూడు విడతలుగా సాయం అందచేస్తామని తెలిపారు. దీనికి ఈ బడ్జెట్ లో నిధులు కేటాయించాల్సి ఉంది. ఇక మరో ముఖ్యమైన పథకం తల్లికి వందనం. ఇది ఇంట్లో ఎంతమంది చదువుకునే విద్యార్థులున్నా ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయల చొప్పున ఇస్తామన్నారు. జూన్ నెల నుంచి తిరిగి పాఠశాలలు ప్రారంభం కానుండటంతో ఈ పథకాన్ని కూడా అప్పుడే అమలు చేయాల్సి ఉంటుంది. దీనికి కూడా నిధులను బడ్జెట్ లో కేటాయించాల్సి ఉంది. మరి బడ్జెట్ రూపకల్పనలో వీటికి నిధుల కేటాయింపుపై ఇప్పుడు మల్లగుల్లాలు పడుతున్నారు. బడ్జెట్ లో సమగ్రమైన పుష్కలంగా నిధులు కేటాయిస్తేనే హామీలు అమలవుతాయని ప్రజలు నమ్ముతారు. అందుకే ఆయన కసరత్తులు చేస్తున్నారు.
Next Story

