Fri Dec 05 2025 14:11:27 GMT+0000 (Coordinated Universal Time)
175 వంటకాలతో కొత్త అల్లుడికి భోజనం.. ఏం వెరైటీలున్నాయంటే?
విజయనగరం జిల్లాలో ఉన్న గోదావరి ప్రాంతానికి చెందిన తోట వెంకటేశ్వరరావు దసరా పండగకు తన ఇంటికివచ్చి అల్లుడికి 175 రకాల వంటకాలతో భోజనం వడ్డించారు

గోదావరి ప్రాంతానికి చెందిన వాళ్ల ప్రేమ మామూలుగా ఉండదు. పిలుపు నుంచి తిండి వరకూ వారికి ప్రత్యేకత ఉంటుంది. ఎవరి స్థాయిలో వాళ్లు తమకున్న స్థాయిలో ఆతిథ్యం విషయంలో అసలు రాజీపడరు. గోదావరిజిల్లాలో పుడితే పెట్టిపుట్టినట్లే అంటారు. ఆ నీళ్లు.. ఆ వాతావరణం.. ఆ సంస్కృతి అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక గోదావరి ప్రాంతానికి చెందిన పెళ్లిళ్లకు హాజరయిన వారికి తెలుస్తుంది వారి ఆతిథ్మమేంటో. అన్ని రకాల వంటకాలతో వచ్చిన అతిధులను సంతృప్తి పరుస్తారు. కడుపు నిండా భోజనం పెట్టి, ఆప్యాయతతో పలకరించి పంపుతుంటారు. బంధువులు, స్నేహితులనే అలా చేస్తే ఇక పండగలకు కొత్త అల్లుళ్లు వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. వారు ఎక్కడ ఉన్నా కడుపు నిండా పెట్టి చంపేస్తారన్న నానుడితో సెటైర్లు కూడా వినిపిస్తాయి.
దసరా పండగకు వచ్చిన...
తాజాగా విజయనగరం జిల్లాలో ఉన్న గోదావరి ప్రాంతానికి చెందిన తోట వెంకటేశ్వరరావు దసరా పండగకు తన ఇంటికివచ్చి అల్లుడికి 175 రకాల వంటకాలతో పెద్ద అరిటాకులో విస్తరించగా కొత్త అల్లుడి మైండ్ బ్లాంక్ అయింది. తోట వెంకటేశ్వరరావు, ఉమ దంపతులది స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం. వారు ఉపాధి నిమిత్తం విజయనగరం జిల్లాలో స్థిరపడ్డారు. ఒక ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్న వెంకటేశ్వరరావు తన కుమార్తె తోట ధరణికి ఏడాది క్రితం ఏలూరు జిల్లా తణుకుకు చెందిన సంతోష్ కు ఇచ్చి వివాహం చేశారు. దసరా పండగకు వచ్చిన అల్లుడు సంతోష్ కు 175 రకాల వంటకాలతో అబ్బుర పర్చేలా విందుభోజనాన్ని వడ్డించారు.
ఎక్కడున్నా గోదారోళ్లు...
గోదారోళ్లు అమెరికాలో ఉన్నా అంతే. తమ ఇంటికి వచ్చిన వారికి తృప్తిగా భోజనం పెట్టి పంపుతారు. ఇక విజయనగరం జిల్లాలో తమ ఇంటికి వచ్చిన అల్లుడి కోసం భోజనంలో అన్ని రకాల స్వీట్లు, పచ్చళ్లు, రకరకాల కూరగాయలతో చేసిన వంటకాలను వడ్డించి తినమని ముందుంచారు. అయితే సంతోష్ ది కూడా గోదావరి జిల్లా కావడంతో పెద్దగా ఆశ్చర్య పోకపోయినా.. ఆ ఇంటికి వచ్చిన అతిధులు మాత్రం ఆశ్చర్యపోయారు. ఇన్ని రకాల వంటకాలు చేసి అల్లుడికి భోజనం వడ్డించడంపై చర్చించుకున్నారు. గోదారోళ్లా.. మజాకా? అంటూ ముక్కున వేలేసుకునేలా వారి భోజనం కళ్లముందు ఉంటే.. ఇక ఆరగించకుండా ఎలా ఉంటారు చెప్పండి...?
Next Story

