Fri Dec 05 2025 15:38:48 GMT+0000 (Coordinated Universal Time)
Gorantla Buchaiah Choudhary : బుచ్చయ్య బాబాయ్ ను సైడ్ చేయడం తప్పదటగా?
సీనియర్ తెలుగు దేశం పార్టీ నేత అయిన గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఇదే ఎమ్మెల్యేగా ఆఖరి అవకాశమని పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతుంది

సీనియర్ తెలుగు దేశం పార్టీ నేత అయిన గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఇదే ఎమ్మెల్యేగా ఆఖరి అవకాశమని పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతుంది. ఆయన వయసు ఇప్పటికే దాటి పోవడంతో పాటు తెలుగుదేశం పార్టీలో యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించడంతో వచ్చే ఎన్నికల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరికి టిక్కెట్ దక్కడం కూడా కష్టమేనంటున్నారు. ఆయన పార్టీకి చేసిన సేవలను గుర్తించి ఏదైనాపెద్దల సభకు పంపవచ్చన్న సంకేతాలు వెలువడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలకు మాత్రమే కాకుండా 2029 ఎన్నికల్లో ప్రధానంగా యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఇప్పటికే పార్టీ నాయకత్వం నిర్ణయించింది. ఇప్పటికే యనమల రామకృష్ణుడి వంటి దిగ్గజ నేతలనే పక్కన పెట్టింది. దీంతో గోరంట్ల బుచ్చయ్య చౌదరిని రాజకీయంగా సైడ్ చేస్తారేమోనన్న టాక్ బలంగా వినిపిస్తుంది.
స్థానం బలం లేకపోయినా...
రాజకీయాల్లో సీనియర్ నేతగా ఆయన అందరికీ సుపరిచితుడే. ప్రకాశం జిల్లా నుంచి తూర్పు గోదావరి జిల్లాకు వచ్చి స్థిరపడిన కుటుంబమయినప్పటికీ రాజకీయంగా బుచ్చయ్య చౌదరి నిలదొక్కుకున్నారు. కమ్మ సామాజికవర్గం నేతగా ఉన్నప్పటికీ కాపులు, బీసీలు బలంగా ఉన్న చోట ఆయన అన్నిసార్లు విజయం సాధించారంటే ఆయన పట్టుదలకు, రాజకీయ చాణక్యానికి నిదర్శనమని చెప్పాలి. ఆయన పోటీ చేసినప్పుడు గెలుపులు అత్యధింగా ఉంటాయి. ఓటమి అనేది చాలా తక్కువ సార్లు ఉంది. రాజమండ్రి పట్టణ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు గెలిచిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజమండ్రి రూరల్ కు వెళ్లి పోటీ చేసినా రెండు సార్లు విజయం సాధించారు. దాదాపు ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బుచ్చయ్య చౌదరి ఎన్టీఆర్ మంత్రి వర్గంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. నాడు టీడీపీ ఆగస్టు సంక్షోభంలో ఎన్టీఆర్ వెంట నిలిచిన బుచ్చన్న తర్వాత పరిణామాల మేరకు చంద్రబాబు పక్షాన చేరారు.
టీడీపీ అధికారంలోకి ఎప్పుడొచ్చినా...
అయితే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా గోరంట్ల బుచ్చయ్య చౌదరికి మంత్రి యోగం దక్కలేదు. ఆయనకు సామాజికవర్గమే కారణమయింది. ప్రాంతమే శాపంగా మారింది. తూర్పు గోదావరి జిల్లా నుంచి ఎన్నికైన ఎమ్మెల్యల్లో కాపులు, బీసీలకు మాత్రమే కేబినెట్ లో అవకాశం కల్పిస్తుండటంతో గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేరు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన నాలుగు సార్లు ఎప్పుడూ ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. అయినా బుచ్చయ్య చౌదరి ఆశతో ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ ప్రతి సారీ బుచ్చన్నకు నిరాశే ఎదురవుతుంది. మొన్నటి ఎన్నికల్లోనూ రాజమండ్రి అర్బన్ నియోజకవర్గం ఆదిరెడ్డి కుటుంబానికి ముందుగానే ఫిక్స్ కావడంతో రూరల్ పై చివర వరకూ టెన్షన్ నడిచింది.
అనేకసార్లు గెలిచినా...
రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా కందుల దుర్గేష్ పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. అయితే పవన్ కల్యాణ్ కు, దుర్గేష్ కు సర్ది చెప్పి ఆయనను నిడదవోలుకు షిఫ్ట్ చేయడంతో గోరంట్లకు చివరకు టిక్కెట్ దక్కింది. ఎమ్మెల్యేగా గెలిచినా కానీ ఆయన అనుకున్నది జరగలేదు. పార్టీని నమ్మకమైన నేతగా పేరున్న గోరంట్ల బుచ్చయ్యచౌదరిని ఈసారి కూడా పక్కన పెట్టారు. అంటే ఆయన తనకు ఇదే చివరి ఎన్నిక అని పదే పదే ఎన్నికల ప్రచారంలో చెబుతూ వస్తున్నారు. అంటే గోరంట్ల బుచ్చయ్యచౌదరి కల నెరవేరదా? అన్న అనుమానం ఆయన అనుచరుల్లో బయలుదేరింది. గోరంట్ల కూడా గత ఎన్నికల ప్రచారంలో ఇదే తన చివరి ఎన్నిక అని ఇక పోటీ చేయబోనని చెప్పడాన్ని కొందరు గుర్తు చేస్తున్నారు. ఆయనకు ఈ దఫా విస్తరణలోనైనా కేబినెట్ లో అవకాశం కల్పించాలని ఆయన అనుచరులు కోరుతున్నారు. లేకుంటే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వకపోవడం మాట అటుంచి ఆయన పోటీ చేయడానికి ఇష్టపడటంలేదని చెబుతున్నారు.
Next Story

