Fri Dec 05 2025 20:46:41 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో మంగళవారం స్వామి దర్శనానికి ఎంత సమయం అంటే?
తిరుమలలో నేడు భక్తుల రద్దీ పెద్దగా లేదు. మంగళవారం కావడంతో భక్తుల రద్దీ కొంత తక్కువగానే ఉంది

తిరుమలలో నేడు భక్తుల రద్దీ పెద్దగా లేదు. మంగళవారం కావడంతో భక్తుల రద్దీ కొంత తక్కువగానే ఉంది. అయితే గత కొంత కాలంగా రద్దీ ఎక్కువగా ఉండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. అలిపిరి నుంచి వాహనాల తనిఖీ కూడా ఆలస్యం అవుతుండటంతో ఎక్కువ మంది తిరుమలకు చేరుకుంటున్నారని అంచనా వేయవచ్చు. అలిపిరి నుంచి సొంత వాహానాల్లో, ఆర్టీసీ బస్సుల్లో, ప్రయివేటు వాహనాలతో పాటు కాలికనడకన వచ్చే భక్తులతో తిరుమల రద్దీ మొన్నటి వరకూ ఎక్కువగా ఉంది.
వేసవి రద్దీతో...
అందుకే వేసవి రద్దీ మరింత ఎక్కువవుతుందని భావించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలిపిరి వద్దనే బేస్ బే ను వాహనాల పార్కింగ్ కోసం ఏర్పాటు చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులను ఆదేశించారు. తిరుమలలో ఎక్కువ వాహనాలు వస్తే పార్కింగ్ కూడా కష్టం కావడంతో కిందనే వాహనాలను పార్క్ చేసి వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో పాటు మే 1వ తేదీ నుంచి సిఫార్సు లేఖలను కూడా స్వీకరించబోమని ఇప్పటికే టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. సామాన్య భక్తులు ఇబ్బందులు పడకుండా ఈ చర్యలు తీసుకుంటున్నారు.
కంపార్ట్ మెంట్లన్నీ...
మరోవైపు నేడు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్ మెంట్లన్నీ ఖాళీగానే ఉన్నాయి. దీంతో స్వామి వారిని నేరుగా దర్శించుకునే అవకాశం నేడు కూడా భక్తులకు దొరుకుతుంది. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడున్నరగంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఏడు నుంచి ఎనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి గంట నుంచి రెండు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 65,904 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 24,487 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.53 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.
Next Story

