Fri Dec 05 2025 14:33:16 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమల వెళుతున్నారా... అయితే తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే?
తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ కొనసాగుతుంది.

తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ కొనసాగుతుంది. అన్ని కంపార్ట్ మెంట్లు నిండి పోయి బయట వరకూ క్యూ లైన్ విస్తరించింది. దాదాపు రెండు నుంచి మూడు కిలోమీటర్ల దూరం వరకూ భక్తుల క్యూ లైన్ విస్తరించి ఉండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భక్తులు ఇబ్బందులు పడకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. క్యూ లైన్ లో ఉన్న భక్తులకు అన్న ప్రసాదాలను, మజ్జిగ, చిన్నారులకు పాలను పంపిణీ చేస్తున్నారు. గత కొద్ది రోజుల నుంచి తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది.
మరో మూడు రోజుల పాటు...
ఏడుకొండల స్వామి సాలికట్ల బ్రహ్మోత్సవాలు నిన్నటితో ముగిసినా భక్తుల సంఖ్య తగ్గలేదు. దసరా సెలవులు ఇంకా ఉండటంతో పాటు ఆదివారం వరకూ ఇదే రద్దీ కొనసాగే అవకాశముందని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రజలతో పాటు తమిళనాడులో పెరటాసి మాసం కావడంతో అత్యధిక సంఖ్యలో భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో భక్తుల రద్దీ పెరిగిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. వసతి గృహాల కోసం కూడా గంటల తరబడి నిరీక్షించాల్సిన అవసరం ఏర్పడుతుంది.
అన్ని కంపార్ట్ మెంట్లలో....
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లలో భక్తులు నిండిపోయారు. బయట బాట గంగమ్మ ఆలయం వరకూ భక్తుల క్యూ లైన్ కొనసాగుతుంది. సర్వదర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ఉదయం ప్రవేశించే భక్తులకు శ్రీవారి దర్శనం ఇరవై గంటలకు పైగానే సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఏడు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 75,188మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 31,640 మంది తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 2.66 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

