Fri Dec 05 2025 22:43:48 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో నేడు భక్తుల రద్దీ చూస్తే గోవిందా అనాల్సిందే
తిరుమలలో నేడు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ మరింత ఎక్కువగా ఉంది

తిరుమలలో నేడు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ మరింత ఎక్కువగా ఉంది. శుక్రవారం నుంచి ఆదివారం వరకూ భక్తుల రద్దీ అధికంగానే ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో టీటీడీ అధికారులు అందుకు తగినట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు ఇబ్బంది పడకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. కంపార్ట్ మెంట్లలోనూ, క్యూ లైన్ లలోనూ వేచి ఉన్న భక్తులకు మజ్జిగ, అన్నప్రసాదాలను పంపిణీ చేస్తున్నారు.
అన్ని ఏర్పాట్లు...
శ్రీవారి సేవకుల ద్వారా తిరుమలలో తాగునీటిని కూడా అన్ని చోట్ల ఏర్పాటు చేశారు. వేసవి తీవ్రత ఎక్కువగా ఉండటంతో మంచినీటి కోసం జనం ఇబ్బందులు పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భక్తులు గుమికూడే అన్ని చోట్లా ప్రత్యేకంగా ఏర్పాట్లను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చేపట్టారు. కంపార్ట్ మెంట్లన్నీ భక్తులతో కిటకిట లాడుతుండటంతో వేడిని తగ్గించేందుకు ఎయిర్ కూలర్లను ఏర్పాటు చేశారు. రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో వత్తిడికి లోనయి ఎలాంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు వైద్యులను కూడా అందుబాటులో ఉంచారు.
హుండీ ఆదాయం...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 23 కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం కోసం ఈరోజు ఉదయం ఏడున్నర గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటలకు దర్శన సమయం పడుతుందని, మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుదని అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.80 కోట్ల రూపాయలు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.
Next Story

