Fri Dec 05 2025 13:54:14 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలకు పోటెత్తిన భక్తులు.. నేడు దర్శన సమయం ఎంతంటే?
తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. గురువారం అయినా సరే భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గలేదు

తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. గురువారం అయినా సరే భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గలేదు. గత పది రోజుల నుంచి తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుండటంతో రోజు ఎనభై వేల మంది నుంచి 90 వేల మంది వరకూ స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. వేసవి సెలవులు పూర్తి కావస్తుండటంతో పాటు వాతావరణం చల్లబడటంతో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది. పది రోజుల క్రితం వరకూ భక్తులు పెద్దగా రాకపోవడంతో సిఫార్స్ లేఖలను కూడా తిరిగి స్వీకరించడం టీటీడీ అధికారులు ప్రారంభించారు. అప్పటి నుంచి తిరుమలకు అత్యధికంగా భక్తుల రద్దీ పెరిగిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు.
పది రోజుల నుంచి...
ప్రతి రోజూ పది రోజుల నుంచి కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి బయట వరకూ క్యూ లైన్లు విస్తరించి ఉన్నాయి. తిరుమలలో భక్తుల తాకిడి ఎక్కువ కావడంతో భక్తులు ఇబ్బందులు పడకుండా తిరుమలలో అన్ని ప్రాంతాల్లో అన్న ప్రసాదాలను టీటీడీ అధికారులు ఏర్పాటు చేశారు. ఇక క్యూ లైన్లలో గంటల తరబడి వేచి చూసే వారికి కూడా అన్న ప్రసాదాలను, మజ్జిగ, మంచినీరు వంటి వాటిని శ్రీవారి సేవకులు అందిస్తున్నారు. జూన్ మొదటి వారంలో పాఠశాలలు, విద్యాసంస్థలు ప్రారంభం కానున్న నేపథ్యంలో తిరుమలకు ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగింది. హుండీ ఆదాయం కూడా తిరుమలకు భారీగా పెరిగిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.
అన్ని కంపార్ట్ మెంట్లు నిండి...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బయట ఏటీజీహెచ్ వరకూ భక్తుల క్యూ లైన్ విస్తరించింది. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడున్నర గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటలకుపైగానేసమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని83,621 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 33,445 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.97 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు.
Next Story

