Fri Dec 05 2025 18:50:26 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : ఎక్సైజ్ శాఖకు ఝలక్ ఇచ్చిన వ్యాపారులు.. బార్ల వైపు చూడలేదుగా
ఆంధ్ర్రప్రదేశ్ లో కొత్త బార్ల పాలసీకి స్పందన కొరవడింది. ఆశించిన రీతిలో దరఖాస్తులు అందకపోవడంతో ఎక్సైజ్ శాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు.

ఆంధ్ర్రప్రదేశ్ లో కొత్త బార్ల పాలసీకి స్పందన కొరవడింది. ఆశించిన రీతిలో దరఖాస్తులు అందకపోవడంతో ఎక్సైజ్ శాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు. లైసెన్సు ఫీజు భారీగా తగ్గించినప్పటికీ దరఖాస్తుదారులు ముందుకు రాకపోవడానికి కారణాలపై ఎక్సైజ్ అధికారులు ఆరా తీస్తున్నారు. నిజానికి ఏపీలో బార్ల లైసెన్స్ ల కోసం ఎప్పుడూ ఎగబడతారు. బార్లకు సమయం కూడా ప్రభుత్వం పెంచడంతో గిరాకీ పెరిగే అవకాశముంది. అత్యధిక లాభాలను ఆర్జించే అవకాశాలున్నాయి. అయినా సరే ఎందుకో గాని ఈ సారి బార్ల లైసెన్సుల కోసం దరఖాస్తులు అతి తక్కువ రావడంతో దీనిపై ఎక్సైజ్ అధికారులు కింది స్థాయి అధికారులతో మాట్లాడుతున్నారు.
నేటితో గడువు ముగుస్తున్నా...
రాష్ట్ర వ్యాప్తంగా 840 బార్లకు ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈరోజుతో దరఖాస్తు గడువు ముగియనుంది. అయితే ఇప్పటి వరకూ వచ్చిన దరఖాస్తులు కేవలం తొంభయి మాత్రమేనని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. ఇంత తక్కువ దరఖాస్తులు వస్తే లాటరీ వేయడం కూడా కష్టమేనని ఎక్సైజ్ శాఖ అధికారులు భావిస్తున్నారు. మద్యం వ్యాపారులు ఎక్కువ మంది ఉత్సాహం చూపడానికి గల కారణాలను అన్వేషించడంలో ఎక్సైజ్ శాఖ అధికారులు ఉన్నారు. నిజంగా ఇది ఆశ్చర్యానికి గురి చేస్తుందంటున్నారు. దీనికి ప్రధాన కారణం అధికార పార్టీ ఎమ్మెల్యేల వత్తిడి కూడా కొంత ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి.
ఎనిమిది జిల్లాల్లో...
అదే సమయంలో ఎనిమిది జిల్లాల్లో ఒక్క దరఖాస్తు కూడా రాకపోవడంతో ఎక్సైజ్ శాఖ అధికారులు ఆందోళనలో ఉన్నారు. అనంతపురం, కోనసీమ, అనకాపల్లి, తూర్పు గోదావరి, నెల్లూరు, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. గుంటూరు, ప్రకాశం, విజయవాడ వంటి ప్రాంతాల్లోనూ తక్కువ దరఖాస్తులు వచ్చాయంటున్నారు. అయితే బెల్ట్ షాపులు పెరిగిపోవడంతో పాటు వైన్ షాపులనే మినీ బార్లుగా మలచి వ్యాపారాలను నిర్వహిస్తుండటంతో తాము బార్లకు లైసెన్సు ఫీజు చెల్లించి అనుమతులు పొందినా గిరాకీ రావడం కష్టమేనని భావించి వెనక్కు తగ్గి ఉంటారని అనుమానిస్తున్నారు. మరొకవైపు వ్యాపారులు సిండికేట్ అయ్యారన్న సందేహాలు కూడా ఉన్నాయి.
Next Story

