వర్షం వచ్చింది.. వజ్రాల వేట మొదలైంది
అదృష్టం తమనే వరిస్తుందనే ఆశతో ఎన్నో కుటుంబాలు ఆ పొలాల్లో వజ్రాల వేటకు వెళ్లాయి.

అదృష్టం తమనే వరిస్తుందనే ఆశతో ఎన్నో కుటుంబాలు ఆ పొలాల్లో వజ్రాల వేటకు వెళ్లాయి. తొలకరి పలకరింపుతో కృష్ణా తీరం వెంబడి పొలాల్లో వజ్రాల కోసం వెదుకులాట మొదలైంది. కృష్ణానది తీరంలో విలువైన వజ్రాలు దొరుకుతాయి అనడానికి చారిత్రక ఆధారాలు చాలానే ఉన్నాయి. కోహినూర్ వజ్రం కూడా కృష్ణా తీరంలోనే దొరికింది.
ఖరీదైన వజ్రాలు లభిస్తుండటంతో స్వాతంత్ర్యానికి పూర్వం నిజాం నవాబు కంచికర్ల మండలం లోని పరిటాల, మోగులూరు, బత్తినపాడు, గనిఆత్కూరు, చందర్లపాడు మండలంలోని కొడవటికల్లు, ఉస్తేపల్లి, నూజివీడు దగ్గర ఉన్న మల్లవల్లి గ్రామాలను మాత్రం ఈస్ట్ ఇండియా కంపెనీకి అప్పగించలేదు. వర్షం కురిసిన మరుసటి రోజు ఎక్కువ మంది వజ్రాల కోసం వెదుకుతుంటారు. వర్షానికి మట్టి పైభాగం కొట్టుకుపోతుంది. పొర కింద ఉండే వజ్రాలు బయటపడతాయి. మట్టి తవ్వకుండానే కొందరు వెదుకుంటారు. సాగుభూముల్లో కూడా వజ్రాలు దొరికిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

