Mon Dec 08 2025 23:37:38 GMT+0000 (Coordinated Universal Time)
Weather Report : ఏసీలు మళ్లీ మొదలయ్యాయ్... ఉష్ణోగ్రతలు పెరిగాయిగా?
. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. విద్యుత్తు వినియోగం కూడా భారీగా పెరిగింది, వర్షాలు పడటం లేదు

వానలు సంగతి దేవుడెరుగు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. విద్యుత్తు వినియోగం కూడా భారీగా పెరిగింది. వర్షాకాలంలో పడాల్సిన వానలు స్థానంలో తిరిగి ఎండలు దర్శనమిస్తున్నాయి. ఉక్కపోత కూడా విపరీతంగా పెరిగింది. దీంతో ఫ్యాన్లు, ఏసీల వాడకం విపరీతంగా పెరిగింది. గత రెండు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇదే రకమైన వాతావరణం కనిపిస్తుంది. ప్రజలు ఉక్కపోతతో అలమటించిపోతున్నారు. సాయంత్రానికి చల్లబడుతున్నా ఉదయం పది గంటల నుంచి ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది.
లోటు వర్షపాతం...
జులై నెలలో వానలు పడాల్సినంత స్థాయిలో పడలేదని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో తేమ లేని వాతావరణం నెలకొంది. అదే సమయంలో రెండు రాష్ట్రాల్లో లోటు వర్షపాతం నమోదయింది. మరొక వైపు ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో రైతులు విత్తనాలు నాటి సాగుకు సిద్ధమయిన సమయంలో సరైన వర్షాలు లేకపోవడంతో రైతాంగం ఇబ్బందులు పడుతున్నారు. అయితే వాతావరణ శాఖ మాత్రం ఆగస్టు రెండో వారం నుంచి భారీ వర్షాలు పడతాయని చెబుతోంది.
ప్రాజెక్టులు నిండి...
మరొకవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులు నిండిపోయాయి. జలకళను సంతరించుకున్నాయి. అనేక ప్రాజెక్టులు నిండి గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులోనూ గేట్లు ఎత్తారు. ప్రాజెక్టును చూసేందుకు పర్యాటకులు పోటెత్తుతున్నారు. మరొకవైపు నాగార్జున సాగర్ ప్రాజెక్టులో కూడా నిండుకుండను తలపిస్తుండటంతో గేట్లను ఎత్తారు. జూరాల ప్రాజెక్టు కూడా నిండిపోయి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
Next Story

