Tue Dec 30 2025 15:30:10 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీ పాలనపై ప్రజల్లో ఆగ్రహం.. అసంతృప్తి
వైసీపీ పాలనపై ప్రజలు అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు

వైసీపీ పాలనపై ప్రజలు అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసం అందరూ ఆలోచించాలన్నారు. జరగబోయే నష్టాన్ని అందరూ గమనించాలని కోరారు. మేధావులు ముందుకు వచ్చి ఈ పాలనపై ప్రజల్లో చైతన్యం తేవాలని చంద్రబాబు కోరారు. అమరావతిని సర్వ నాశనం చేశారన్నారు. త్యాగాలు చేసి రైతులు భూముల ఇస్తే దానిని వదిలేసి రాష్ట్రానికి తీవ్ర నష్టం చేకూర్చారని చంద్రబాబు మండి పడ్డారు. ప్రజా వేదికను కూల్చి విధ్వంసంతోనే తన పాలనను జగన్ ప్రారంభించారన్నారు. అమరావతి ఇక్కడే ఉంటుందని ఎన్నికలకు ముందు చెప్పి అధికారంలోకి రాగానే ఎందుకు మాట మార్చారని ప్రశ్నించారు.
ప్రజా ధనాన్ని....
ప్రజాధనాన్ని జగన్ ప్రభుత్వం దుర్వినియోగం చేశారన్నారు. అమరావతిపై పదివేల కోట్లు ఖర్చు చేశామని చంద్రబాబు గుర్తు చేశారు. భూములు ఇచ్చిన వారిని కూడా అవమానిస్తున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టును కూడా పూర్తి చేసే పరిస్థితిలో లేరన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో 64 వేల కోట్లు ఖర్చు చేశామని, మీరెంత ఖర్చు పెట్టారో లెక్కలు చెప్పమని చంద్రబాబు నిలదీశారు. కియా వంటి ప్రాజెక్టులు ఏం తెచ్చారో చెప్పాలన్నారు. విధ్వంసం చేసినంత సులువు కాదు ప్రాజెక్టులు తేవడమని చంద్రబాబు ఎద్దేవా చేశారు. పారిశ్రామికవేత్తలు రాష్ట్రం నుంచి వెళ్లపోతున్నారన్నారు. యువత ఈ విషయాన్ని ఆలోచించుకుని ముందుకు వెళ్లాలన్నారు.
రెండు లక్షల కోట్లను....
రెండు లక్షల కోట్ల రూపాయల సంపదను జగన్ విధ్వంసం చేస్తే ప్రజల్లో ఖచ్చితంగా స్పందించాలన్నారు. మేధావులు సయితం ముందుకు రావాలన్నారు. రాజకీయ పార్టీ నేతలు, కార్యాలయాలపై దాడులు చేసే పరిస్థితికి వచ్చిందన్నారు. జగన్ ఒక విధ్వసంకుడిగా మారారని చంద్రబాబు అన్నారు. రైతాంగం పూర్తిగా నష్టపోయిందన్నారు. విద్య, వైద్య వంటి సౌకర్యాలను కూడా కల్పించలేకపోయారన్నారు. జగన్ పాలనలో అవినీతి కేంద్రీకృతమైందని అన్నారు. పేద ప్రజల భవిష్యత్ ను అంధకారంలోకి నెట్టారన్నారు. ఈ సందర్భంగా పలు వీడియోలను చంద్రబాబు చూపించారు.
Next Story

