Fri Dec 05 2025 11:24:12 GMT+0000 (Coordinated Universal Time)
Somireddy : ఆఖరి బాల్ కు సిక్స్ కొట్టాలన్నదే సోమిరెడ్డి ప్రయత్నమా?
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చంద్రబాబు కేబినెట్ లోకి చేరడానికి తహతహలాడుతున్నారు

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చంద్రబాబు కేబినెట్ లోకి చేరడానికి తహతహలాడుతున్నారు. అందుకే వైసీపీకి కౌంటర్ లు ఇవ్వడంలో ముందుంటారు. ఏ విషయంలోనైనా సోమిరెడ్డి ముందుంటున్నారు. వైసీపీ అధినేత జగన్ పై విమర్శలు చేయడంలో ప్రస్తుతం ఉన్న మంత్రుల కన్నా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెంటనే స్పందిస్తూ ఆయన టీడీపీ నాయకత్వం దృష్టిలో పడాలని ప్రయత్నిస్తున్నట్లు కనపడుతుంది. లోకేశ్ ను ఉప ముఖ్యమంత్రిగా చేయాలని, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేయాలని కూడా సోమిరెడ్డి డిమాండ్ చేయడం వెనక మంత్రివర్గంలోకి ఛాన్స్ వస్తుందేమోనన్న ఆశ ఆయనలో స్పష్టంగా కనిపిస్తుందంటున్నారు. తన ప్రత్యర్థి కాకాణి గోవర్ధన్ రెడ్డిని కూడా సుదీర్ఘకాలం జైలులో ఉంచి తన సత్తా చూపారు.
వరస ఓటముల తర్వాత...
వరసగా ఓడిపోయినా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి చంద్రబాబు కేబినెట్ లో మంత్రి పదవి ఖాయం. ఎందుకంటే సింహపురిలో ఆయనే పార్టీలోకింగ్. మరొకరు పోటీ లేరు. కానీ ఈసారి చాలా రోజుల తర్వాత సర్వేపల్లి నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. బలమైన వాయిస్.. సామాజికవర్గం అంతకు మించి పార్టీలో తొలి నుంచి ఉన్న వ్యక్తిగా ఆయనను ఎవరూ కాదనలేరు. అలాంటిది ఈసారి మాత్రం ఆయనకు అనేక రూపాల్లో మంత్రి పదవులకు ఇబ్బందులు కలిగాయి. నెల్లూరు జిల్లా నుంచి నారాయణ ఎన్నిక కావడంతో ఆయనకు ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాల్సి వచ్చింది. అదేసమయంలో పార్టీలో చేరిన ఆనం రామనారాయణరెడ్డికి కూడా మంత్రి పదవి దక్కడంతో సోమిరెడ్డిని పక్కన పెట్టారు.
రెండున్నరేళ్ల తర్వాత...
కానీ రెండున్నరేళ్ల తర్వాత అయినా చంద్రబాబు మంత్రి వర్గ విస్తరణ తప్పదని అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడున్నమంత్రుల పట్ల చంద్రబాబు అసంతృప్తిగానే ఉన్నారు. అయితే వెనువెంటనే మంత్రివర్గం నుంచి తప్పిస్తే ప్రభుత్వంపై తప్పుడు సంకేతాలువెళతాయని భావించి చంద్రబాబు రెండేళ్ల తర్వాత ఖచ్చితంగా మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు చేస్తారని అంటున్నారు. ఎన్నికల టీంను సిద్ధం చేసుకుంటారని అంటున్నారు. తొలిదఫా యువతకు ప్రాధాన్యత ఇచ్చినా రెండో విడతలో మాత్రం సీనియర్లకు ప్రాధాన్యత ఇస్తారన్నది పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అందుకే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన వంతు ప్రయత్నంలో భాగంగా అందరికంటే వేగంగా స్పందిస్తున్నారంటున్నారు. మొత్తం మీద సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుందన్నది చూడాల్సి ఉంది.
Next Story

