Sun Dec 14 2025 20:22:16 GMT+0000 (Coordinated Universal Time)
Kotamreddy Srdhar Reddy : అహో.. కోటంరెడ్డి.. అబ్బ.. ఆశ.. దోశ.. అప్పడం..వడ
తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి పెద్ద కోరిక ఉన్నట్లు కనపడుతుంది

తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి పెద్ద కోరిక ఉన్నట్లు కనపడుతుంది. వచ్చే మంత్రివర్గ విస్తరణలో ఆయన బలంగా తనకు స్థానం కల్పించాలని కోరుతున్నారు. మంత్రి పదవి ఆశించడంలో తప్పులేదు. అందులోనూ మూడు సార్లు వరసగా గెలిచి హ్యాట్రిక్ సాధించిన ఎమ్మెల్యేగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి మంత్రి వర్గంలో చోటు కల్పించడంలో ఎటువంటి తప్పులేదు. అందులో నిజం కూడా ఉంది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కేవలం మూడు సార్లు గెలవడమే కాకుండా బలమైన గొంతుక ఉంది. మంచి వాగ్పటిమ ఉంది. ప్రత్యర్థి పార్టీలను ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తూ అధికార పార్టీలో యాక్టివ్ గా ఉండే ఎమ్మెల్యేల్లో ఆయన ఒకరు అని చెప్పక తప్పదు.
గత ఎన్నికలకు ముందే...
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గత ఎన్నికలకు ముందే వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు. నిజంగా నాడు కోటంరెడ్డి వైసీపీ అధికారంలో ఉండి రావడంతో కొంత అడ్వాంటేజీ అప్పటి ప్రతిపక్షంలో ఉన్న టీడీపీకి అయిందన్న దానిలో ఎలాంటి సందేహం లేదు. అసలు అమరావతి రైతులు తిరుమల వరకూ పాదయాత్ర చేసిన నేపథ్యంలో నెల్లూరులో వారికి అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసి భోజనాలు అందించి అప్పుడే టీడీపీకి కొంత కనెక్ట్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వంలో అసంతృప్తిగా ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ముఖ్యమంత్రి పేషీలోని అధికారులతో పాటు మరికొందరు నేతలు ఆ ఛాన్స్ ఇచ్చారు. దీంతో పార్టీ మారి ఆయన టీడీపీలో చేరిపోయారు. అయితే తెలుగుదేశం పార్టీలోకి వచ్చి రెండేళ్లు మాత్రమే అయింది.
జిల్లాలో అనేక మంది నేతలు...
అలాగంటే నెల్లూరు జిల్లాలోని ఆనం రామనారాయణరెడ్డి కూడా వైసీపీ నుంచి టీడీపీ లోకి వచ్చిన వారే. ఆయన కూడా అసంతృప్తితో వచ్చిన వారే. ఆనం వరసగా మాత్రం గెలవలేదు. అయితే సీనియర్ నేత కావడంతో తొలి విడతలో మంత్రి పదవి వరించింది. మరొకవైపు నెల్లూరు జిల్లాలో మరో సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉన్నారు. ఆయన టీడీపీ అధికారంలో ఉన్నప్పుడల్లా మంత్రి పదవి దక్కేది. గెలవకపోయినా ఎమ్మెల్సీ పదవి ఇచ్చి చంద్రబాబు మంత్రిని చేశారు. ఆయన కూడా మంత్రివర్గ విస్తరణ జరిగితే తనకు అవకాశం లభిస్తుందని భావిస్తున్నారు. ఇక వేమిరెడ్డి కుటుంబం కూడా ఆశలు పెట్టుకుంది. ఇలా అనేక మంది నేతలు పోటీ ఉన్న నెల్లూరు జిల్లాలో వారిని తట్టుకుని మంత్రివర్గం రేసులో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ముందుంటారా? అన్నదే ఇప్పుడు ప్రశ్న. కానీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రం తాను ప్రయత్నిస్తే పోయేదేమీ లేదన్న భావనలో ఉన్నట్లుంది. మరి చివరకు చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది చూడాలి.
Next Story

