Fri Dec 05 2025 13:43:06 GMT+0000 (Coordinated Universal Time)
TDP : ఫోన్ రింగ్ అవుతుందేమోనని చేతిలోనే పట్టుకుని కూర్చున్న టీడీపీ నేతలు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఉదయం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఉదయం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. ఉండవల్లిలోని తన నివాసంలోనే ఉండి ఆయన జాబితాను నేడు ఖరారు చేయనున్నారు. మొత్తం నలుగురు ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఇప్పటికే ఒకటి జనసేనకు కేటాయించడం, పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు నామినేషన్ వేయడంతో మరో నాలుగు స్థానాలు మాత్రమే ఖాళీలున్నాయి. ఇందులో టీడీపీ నేతలు అనేక మంది ఆశలు పెట్టుకున్నారు. ఉన్న స్థానాలు నాలుగు అయితే.. ముప్ఫయి మంది ఆశావహులున్నారు. దీంతో ఎవరి పేరును చంద్రబాబు ఖరారు చేస్తారన్న ఉత్కంఠ మాత్రం తెలుగుదేశం పార్టీ వర్గాల్లో నెలకొంది.
సిట్టింగ్ లు ఎవరికీ...
అయితే సిట్టింగ్ ఎమ్మెల్సీలు ఎవరికీ ఈసారి స్థానం దక్కే అవకాశం లేదని చెబుతున్నారు. ముఖ్యంగా యనమల రామకృష్ణుడు, జంగా కృష్ణమూర్తితో పాటు మిగిలిన వారిని కూడా ఎంపిక చేయకపోవచ్చన్నది పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. నాలుగు స్థానాల్లో కొత్త వారికే అవకాశం కల్పించాలన్న నిర్ణయానికి చంద్రబాబు నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. పదవీ విరమణ చేసిన నేతలు చంద్రబాబును, లోకేశ్ ను కలసి తమకు పదవిని రెన్యువల్ చేయాలని విజ్ఞప్తి చేసినా సానుకూలంగా స్పందన రాలేదని చెబుతున్నారు. గత ఎన్నికల్లో టిక్కెట్లు కోల్పోయి, పార్టీ కోసం త్యాగం చేసిన వారికి ప్రధమ ప్రాధాన్యత ఇవ్వాలన్న నిర్ణయంతో టీడీపీ అధినాయకత్వం జాబితాను రూపొందించే అవకాశాలున్నాయి.
వీరి పేర్లు దాదాపుగా...
దేవినేని ఉమా మహేశ్వరరావు మైలవరం టిక్కెట్ ను త్యాగం చేశారు. అలాగే వర్మ పవన్ కల్యాణ్ కోసం పిఠాపురం నియోజకవర్గం టిక్కెట్ ను వదులుకున్నారు. దీంతో ఈ జాబితాలో వీరి పేర్లు ఉండే అవకాశముంటుందని చెబుతున్నారు. మరొకవైపు యాదవ సామాజికవర్గానికి చెందిన బీద రవిచంద్ర పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. సామాజికవర్గం కోటాతో పాటు పార్టీని నమ్ముకుని అంటిపెట్టుకుని ఉన్న బీద రవిచంద్ర యాదవ్ ను ఎమ్మెల్సీగా ఎంపిక చేయాలన్న ఉద్దేశ్యంతో ఉన్నారు. అలాగే నారా లోకేశ్ యువగళం పాదయాత్ర సమయంలో పనిచేసిన వారికి కూడా ప్రాధాన్యత ఇస్తారంటున్నారు. యువతకు కూడా అవకాశమిచ్చి వారిలో కొంత ఉన్న అసహనాన్ని పారదోలాలన్న ప్రయత్నం ఈ దఫా చంద్రబాబు చేసే అవకాశముంది.
విజయవాడ నుంచి...
విజయవాడ నుంచి బుద్దా వెంకన్న కూడా తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పడు తాను వైసీపీకి వ్యతిరేకంగా పోరాడానని గుర్తు చేస్తున్నారు. అలాగే కృష్ణా జిల్లా నుంచి వంగవీటి రాధా కూడా రేసులో ఉన్నారు. ఆయనకు మొన్నటి ఎన్నికల్లోనే టిక్కెట్ ఇవ్వకపోవడంతో ఎమ్మెల్సీ టిక్కెట్ ఇస్తామని చెప్పడంతో ఆయన కూడా పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు. రేపు నామినేషన్లకు చివరి గడువు కావడంతో ఈ మధ్యాహ్నానికి స్పష్టత వచ్చే అవకాశముంది. ఎమ్మెల్సీగా ఎంపిక చేసిన వారికి చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసి నామినేషన్ కు సిద్ధమవ్వాలని చెప్పే అవకాశాలుండటంతో ఫోన్ కోసం ఆశావహులు ఎదురు చూస్తున్నారు. మరి ఎవరికి ఫోన్ వస్తుందన్న టెన్షన్ అందరిలోనూ నెలకొంది.
Next Story

