Tue Dec 30 2025 20:36:20 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ .. నువ్వు బయట కూడా తిరగలేవు
వన్ టైమ్ సెటిల్ మెంట్ పేరుతో జగన్ దోపిడీ చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆరోపించారు

వన్ టైమ్ సెటిల్ మెంట్ పేరుతో జగన్ దోపిడీ చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. పేదల మెడకు ఉరి తాడు బిగించారని ఆయన ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఇళ్ల రిజిస్ట్రేషన్ల పేరుతో బలవంతపు వసూళ్లకు దిగుతున్నారని ఆరోపించారు. ఎన్నికల హామీలను జగన్ నిలబెట్టుకోలేకపోయారన్నారు. ప్రజల కోసం పోరాడే తమ మీద కేసులు పెట్టడం కాదని, వైసీపీ నేతలమీదనే 420 కేసులు పెట్టాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
బయట కూడా తిరగలేరు....
జగన్ ఇకపై బయట కూడా తిరగలేరన్నారు. మాట తప్పిన జగన్ పై చీటింగ్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పట్టా ఇవ్వడానికి జగన్ ఎవరు? స్థలం ఇచ్చారా? ఇల్లు కట్టించారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ఈ రిజిస్ట్రేషన్లు చట్ట ప్రకారం చెల్లవని చంద్రబాబు అన్నారు. ఖబడ్దార్ జాగ్రత్త అంటూ చంద్రబాబు హెచ్చరించారు. ఓటీఎస్ తో ప్రభుత్వం బహిరంగ దోపిడీకి దిగుతుందన్నారు. ఎవరిచ్చారు మీకీ అధికారం అని నిలదీశారు. ఓటీఎస్ లో చేరకపోతే సంక్షేమ పథకానలు కట్ చేస్తామని బెదిరిస్తారా? ఎంత ధైర్యం అని ప్రశ్నించారు.
ఎవరూ చెల్లించొద్దు...
ఓటీఎస్ ద్వారా డబ్బులు చెల్లించమని ఎవరైనా అడిగినా ఎవరూ చెల్లించవద్దని చంద్రబాబు కోరారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచితంగా అందరికీ రిజిస్ట్రేషన్లు చేస్తామని చెప్పారు. ఖజానా నింపుకోవడానికి జగన్ రోజుకొక్క కొత్త ఐడియాతో వస్తున్నారని చంద్రబాబు అన్నారు. ప్రజలు మీ అధికారాన్ని కత్తిరిస్తారని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదన్నారు. ఈరోజు, రేపు, ఎల్లుండి ఉందని గుర్తు పెట్టుకోవాలన్నారు.
Next Story

