Fri Dec 05 2025 11:13:28 GMT+0000 (Coordinated Universal Time)
Telugu Desam Party : టీడీపీకి మరో భారీ గిఫ్ట్.. మోదీ మామూలుగా ఇవ్వడం లేదుగా
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మరో బిగ్ ఆఫర్ ఇచ్చినట్లు తెలిసింది

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మరో బిగ్ ఆఫర్ ఇచ్చినట్లు తెలిసింది. కూటమి గా ఏర్పడిన గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో సూపర్ సక్సెస్ సాధించిన తర్వాత టీడీపీకి బీజేపీ వరస ఆఫర్లు ఇస్తుంది. అందులో భాగంగా కేంద్రంలో రెండు ముఖ్యమైన మంత్రి పదవులు ఇవ్వడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన అన్ని రకాలుగా ఆర్థిక సాయం అందిస్తుంది. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులకు వెనువెంటనే గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. అప్పులు చేయడానికి అవసరమైన అనుమతులను కూడా వేగంగా ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేయడానికి చేయూతగా కేంద్ర ప్రభుత్వం నిలుస్తుంది.
మరో గవర్నర్ పదవి...
దీంతో పాటు తాజాగా మరొక కీలమైన కబురు కేంద్ర బీజేపీ నుంచి వచ్చినట్లు తెలిసింది. విశాఖలో యోగాడే అద్భుతంగా నిర్వహించిన చంద్రబాబుకు ప్రధాని మోదీ గిఫ్ట్ ల మీద గిఫ్ట్ లు ఇస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందులో భాగంగానే ఇప్పటికే ఏపీకి రెండు గవర్నర్ పదవులు ఇచ్చాయి. ఒకటి బీజేపీకి చెందిన హరిబాబుకు గవర్నర్ పదవి లభించగా, మరొకటి టీడీపీకి చెందిన అశోక్ గజపతి రాజుకు గవర్నర్ పదవి దక్కింది. సీనియర్ నేతగా ఉన్న అశోక్ గజపతి రాజు గోవా గవర్నర్ గా బాధ్యతలను స్వీకరించారు. ఇప్పుడు టీడీపీకి మరొక గవర్నర్ పదవి ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖం వ్యక్తం చేసిందన్న సమాచారం అందడంతో ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై పార్టీలో చర్చ జరుగుతుంది.
చాలా మంది సీనియర్లు...
టీడీపీలో చాలా మంది సీనియర్లకు గత ఎన్నికల్లో టిక్కెట్లు లభించలేదు.కొందరు టీడీపీ సీనియర్లు పార్టీలో తొలి నుంచి సేవలు అందించారు. వయసు పెరిగి పోవడంతో వారి సేవలను పార్టీకి కాని, మరొక రూపంలో కానీ వినియోగించుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు యోచిస్తున్నారు. అందులో యనమల రామకృష్ణుడు పేరు వినిపించినప్పటికీ దాని విషయంలో కొన్ని ఇబ్బందులున్నాయి. యనమల కుటుంబానికి ఇప్పటికే చాలా పదవులు ఇచ్చారు. అదే సమయంలో యనమల తనకు రాజ్యసభ పదవి కావాలని కోరుతున్నారు. అందుకే రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకున్న కేఈ కృష్ణమూర్తి పేరును చంద్రబాబు నాయుడు పరిశీలిస్తున్నట్లు సమాచారం. గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు ఉత్తరాంధ్ర జిల్లాకు చెందిన క్షత్రియ సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో, రాయలసీమకు చెందిన బీసీ నేత కృష్ణమూర్తిని గవర్నర్ గా పంపాలని చంద్రబాబు దాదాపు డిసైడ్ అయినట్లు చెబుతున్నారు. మరి నిర్ణయం ఎలా ఉంటుందో?
Next Story

