Fri Apr 03 2026 14:25:17 GMT+0530 (India Standard Time)
TDP : ఉత్తుత్తి హెచ్చరికలేగా.. మన పని మనం చేసుకుపోదాం
చంద్రబాబు మంచితనాన్ని కొందరు ఎమ్మెల్యేలు చేతకానితనంగా తీసుకుంటున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మంచితనాన్ని కొందరు ఎమ్మెల్యేలు చేతకానితనంగా తీసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడూ లేని విధంగా పార్టీ లైన్ తప్పుతుండటాన్ని గమనించినా చూసీ చూడనట్లు ఊరుకుంటున్నారు. గాడి తప్పుతున్న వారిపై చర్యలు తీసుకోకపోవడంతో పాటు ఉత్తుత్తి హెచ్చరికలతో ఎమ్మెల్యేలు మరింత రెచ్చిపోతున్నారన్న కామెంట్స్ పార్టీలోనే వినిపిస్తున్నాయి. కూటమికి ఇప్పుడు బలం ఉంది. మూడు పార్టీలు కలసి ఉన్నప్పుడు తమకు ఎదురు లేదని భావిస్తుంది. మరొకవైపు వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల సంఖ్య కూడా పెరుగుతుంది.
నేతలకు కొరవ లేదు...
తెలుగుదేశం పార్టీకి నేతల కొరత లేదు. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసే వారు పదుల సంఖ్యలో ఉన్నారు. అయినా సరే ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లలోనే అనేక మంది పార్టీ నేతలు క్రమశిక్షణ తప్పారు. వారి వ్యవహార శైలితో పార్టీ ప్రతిష్టతో పాటు ప్రభుత్వం కూడా ప్రజల్లో నవ్వుల పాలవుతుంది. అయితే వారికి నోటీసులు ఇవ్వడం, హెచ్చరికలతోనే చంద్రబాబు సరిపెడుతున్నారని, అందుకే మిగిలిన వారిలో భయం లేకపోవడంతోనే వరస ఘటనలు చోటు చేసుకుంటున్నాయని సోషల్ మీడియాలో తెలుగు తమ్ముళ్లే పోస్టులు పెడుతున్నారు.
క్రమశిక్షణగా ఉండే...
తెలుగుదేశం క్రమశిక్షణకు మారుపేరు. కానీ ఈ మధ్యకాలంలో అలాంటి క్రమశిక్షణ అస్సలు కనిపించట్లేదు.ఎవరికి వారు తామే చక్రవర్తులం అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. అధిష్టానం కూడా వాళ్ల విషయంలో చర్యలు తీసుకునేందుకు ఏమాత్రం ఆసక్తి చూపించట్లేదు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావుకు అప్పగించి చర్చించి వదిలేస్తోంది. దీంతో హద్దు దాటిన నేతలు పదేపదే గీత దాటగలుగుతున్నారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకున్నంత మాత్రాన ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందేమీ లేదు. అయినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అంతు చిక్కడం లేదు. అధిష్టానం ఇలాగే చూసీచూడనట్లు వ్యవహరిస్తే మరిన్ని గొంతులు లేస్తాయన్న వాదన వినిపిస్తుంది. అప్పుడు పరిస్థితిని అదుపు చేయడం కష్టం. అయినా పార్టీ హైకమాండ్ పట్టించుకోవడం లేదంటే ఏమనుకోవాలంటూ తమ్ముళ్లు ఫైర్ అవుతున్నారు.
Next Story

