Fri Dec 05 2025 13:17:10 GMT+0000 (Coordinated Universal Time)
కడప రెడ్డెమ్మ పగ ...కుర్చీ ఇవ్వనందుకు కుర్చీనే లాగేశారుగా?
కడప జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే మాధవి రెడ్డి కసి తీర్చుకున్నారు. మేయర్ కుర్చీని లాగేసుకున్నారు

కడప జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే మాధవి రెడ్డి కసి తీర్చుకున్నారు. కడపలో ఫైర్ బ్రాండ్ లీడర్ గా మాధవి రెడ్డి గెలిచారు. గెలిచింది ఒకేసారి అయినప్పటికీ ఆమె నిత్యం వార్తల్లో ఉంటున్నారు. కడప రెడ్డమ్మగా ఆమె దూకుడుతో వ్యవహరిస్తున్న తీరు కొన్ని సార్లు విమర్శలకు ఎదురవుతున్నప్పటికీ ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. మాధవి రెడ్డి కడప జిల్లాలో టీడీపీలో ఫైర్ ఉన్న లీడర్ గా ఎదుగుతున్నారు. కడప జిల్లా వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా కావడంతో మాధవీ రెడ్డి కి టీడీపీ కూడా అదే స్థాయిలో ప్రయారిటీ ఇస్తుంది. పార్టీ అన్ని రకాలుగా అండగా నిలుస్తుంది. తాజాగా కడప మేయర్ సురేష్ బాబును పదవి నుంచి తొలగించి తన పవర్ ఏంటో మాధవిరెడ్డి చూపించగలిగారు.
కుర్చీ వేయనందుకు...
దానివల్ల వైసీపీకి, సురేష్ బాబుకు సానుభూతి వస్తుందా? లేదా? అన్నది పక్కన పెడితే తాను అనుకున్నది సాధించడంలో మాధవి రెడ్డి ముందున్నారని మాత్రం చెప్పాలి. తాను శపథం చేసినట్లుగానే తనకు మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో వేదికపై కుర్చీ ఇవ్వనంందుకు చివరకు మేయర్ కుర్చీనే లాగేశారు. మున్సిపల్ నిబంధనలను అడ్డుపెట్టి మేయర్ సురేష్ బాబును పదవి నుంచి తొలగించారు. మేయర్ సురేష్ బాబు తన కుటుంబ సభ్యులు డైరెక్టర్లుగా ఉన్న సంస్థకు అరవై లక్షల రూపాయల కాంట్రాక్ట్ పనులు అప్పగించారన్న ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా కడప మేయర్ సురేష్ బాబుపై వేటు వేసింది. దీంతో ఆయన కుర్చీ ఇవ్వనందుకు తన కుర్చీనే కోల్పోవాల్సి వచ్చింది.
తొలిసారి గెలిచినా...
మొన్నటి ఎన్నికల్లో కడప జిల్లాలోనూ తెలుగుదేశం పార్టీ ఏడు నియోజకవర్గాల్లో గెలిచింది. పది శాసనసభ నియోజకవర్గాలున్న కడప జిల్లాలో తొలిసారి కూటమి పార్టీలకు ఇంతటి పెద్ద స్థాయిలో విజయం లభించింది. గతంలో ఇన్ని స్థానాలను టీడీపీ ఎప్పుడూ గెలవలేదు. మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకుని సత్తా చాటింది.యితే కడప నియోజకవర్గంలో 1999లో గెలిచిన తర్వాత మళ్లీ టీడీపీ గెలిచింది 2024 లోనే. 1999 తర్వాత ఇక టీడీపీ అక్కడ గెలవలేదు. అంటే దాదాపు రెండున్నర దశాబ్దం కడప నియోజకవర్గంలో పసుపు జెండా ఎగురలేదనే చెప్పాలి. ఈసారి మాత్రం మాధవి రెడ్డి గెలిచి తన సత్తాను చాటారు. దీంతో ఆమెకు మంత్రి పదవి దక్కుతుందని భావించినా కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగా అది సాధ్యం కాలేదు.
తొలి నుంచి ఆమె కుటుంబం...
మాధవీ రెడ్డి భర్త కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు రెడ్డప్పగారి శ్రీనివాసులు రెడ్డి. తొలి నుంచి ఆయన కుటుంబం టీడీపీలోనే కొనసాగుతుంది. ఆర్థికంగా, సామాజికపరంగా బలమైన కుటుంబంగా పేరుంది. జగన్ సొంత జిల్లాలో అదీ కడపలో గెలవలేకపోయినా పార్టీ జెండాను రెడ్డప్పగారి కుటుంబం వదిలి పెట్టలేదు. ఈసారి మాత్రం తన సతీమణి మాధవరెడ్డికి టిక్కెట్ తెచ్చుకుని మరీ గెలిపించుకున్నారు. మాధవీ రెడ్డి గెలిచిన దగ్గర నుంచి స్పీడ్ గానే ఉన్నారు. కార్పొరేషన్ లో కుర్చీ కోసం చేస్తున్న గలాటా కూడా కొంత కాంట్రవర్సీగా మారినా ఆమె వెనక్కు తగ్గలేదు. కార్పొరేషన్ సమావేశంలోనే మాధవి రెడ్డి శపథం చేశారు. తనకు వేదికపై కుర్చీ వేయని నువ్వు కుర్చీలో ఉలా ఉంటావో చూస్తానంటూ వెళ్లిపోయారు. అనుకున్నట్లే మాధవి రెడ్డి అనుకున్నది సాధించారు.
Next Story

