Fri Dec 05 2025 13:34:35 GMT+0000 (Coordinated Universal Time)
Maha Nadu : నేటి నుంచి మహానాడు ప్రారంభం.. మూడు రోజులు పసుపు పండగ
టీడీపీ మహానాడు నేటి నుంచి ప్రారంభమవుతుంది. మూడు రోజుల పాటు కడప జిల్లాలో పసుపు పండగ జరగుతుంది

మహానాడు నేటి నుంచి ప్రారంభమవుతుంది. మూడు రోజుల పాటు కడప జిల్లాలో పసుపు పండగ జరగుతుంది. మహానాడుకు ఏర్పాట్లు గత కొన్ని రోజుల నుంచి చేస్తున్నారు. ఈరోజు పార్టీ ప్రతినిధుల సభతో పాటు సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ కారయాచరణతో పాటు టీడీపీ మౌలిక సిద్ధాంతాలపై మహానాడులో చర్చ జరుగుతుంది. కార్యకర్తలకు పెద్ద పీట వేయాలని, అందులోనూ యువతకు ప్రాధాన్యం కల్పించాలని దాదాపుగా నిర్ణయించారు. ఇక నారా లోకేశ్ ప్రతిపాదించిన ఆరు సూత్రాలను కూడా మహానాడు తొలిరోజున ఆవిష్కరించే అవకాశాలున్నాయి. అలాగే పార్టీ నియమావళిలో సవరణలపై కూడా చర్చించి నేడు తగిన సూచనలు తీసుకుని మార్పులు చేసే ఛాన్స్ కనిపిస్తుంది.
నేడు నోటిఫికేషన్...
ఇక పార్టీ కోసం జాతీయ పార్టీ అధ్యక్షుడి ఎన్నిక కోసం నోటిఫికేషన్ ను కూడా విడుదల చేయనున్నారు. మహానాడును ప్రారంభించే ముందు పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కు ఘన నివాళులర్పించిన అనంతరం పార్టీ జెండాను చంద్రబాబు ఆవిష్కరిస్తారు. అనంతరం ఒక్కొక్కొ అంశంపై ఎంపిక చేసిన నాయకులు ప్రసంగాలు ఉంటాయి. తొలి ప్రసంగంతో పాటు ముగింపు ప్రసంగం కూడా చంద్రబాబు చేయనున్నారు. ఈరోజు ఉదయం 8.30 గంటలకు ప్రతినిధులు నమోదుతో మహానాడు కార్యక్రమం ప్రారంభం కానుంది. అనంతరం పార్టీ కోసం పనిచేసి మరణించిన కార్యకర్తలు, నేతలకు మహానాడు వేదికగా సంతాపాన్ని ప్రకటించనున్నారు.
అనేక అంశాలపై...
అనంతరం పార్టీ ప్రధాన కార్యదర్శి నివేదికను మహానాడు ప్రాంగణంలో సమర్పిస్తారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తొలుత స్వాగతోపన్యాసం చేయనున్నారు. ట్రెజరర్ పార్టీ ఖర్చులు, ఆదాయాలను సభ ముందు ఉంచుతారు. అనంతరం చంద్రబాబు ప్రారంభోపన్యాసం చేయనున్నారు. తర్వాత టీడీపీ మౌలిక సిద్ధాంతాలపై చర్చించనున్నారు. మూడు సార్లు ఒకే పదవి చేసిన వారిని అంతకన్నా పెద్ద పదవికి పంపాలన్న నిర్ణయంపై కూడా చర్చ జరగనుంది. ఇక కార్యకర్తే అధినేత, యువగళం అంశంపై కూడా చర్చ జరుగుతుంది. దీంతో పాటు కార్యకర్తల సంక్షేమం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలను గురించి కూడా మహానాడులో సమీక్షించనున్నారు. రెండో రోజు జాతీయ పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుంది. అనేక తీర్మానాలుచేసిన తర్వాత మూడో రోజు ఐదు లక్షల మందితో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు.
Next Story

