Fri Dec 05 2025 12:47:53 GMT+0000 (Coordinated Universal Time)
Ap Politcs : జనసేనకు ఆ జిల్లాను రాసిచ్చేశారా? టీడీపీ నేతల్లో అంతర్మథనం
తూర్పుగోదావరి జిల్లా కాపు సామాజికవర్గం నేతలు టీడీపీలో ఉంటే వారికి భవిష్యత్ లోనూ పదవులు కష్టంగానే కనిపిస్తుంది

తూర్పుగోదావరి జిల్లా కాపు సామాజికవర్గం నేతలు టీడీపీలో ఉంటే వారికి భవిష్యత్ లోనూ పదవులు కష్టమేనా? అంటే అవుననే అనిపిస్తుంది. ఎందుకంటే తూర్పు గోదావరి జిల్లాలో కాపు సామాజికవర్గానికి చెందిన టీడీపీ నేతలకు ఈసారి కేబినెట్ లో స్థానం దక్కలేదు. కాపులు అంటే జనసేన అని ముద్రపడిపోయింది. దీంతో గత కొన్ని దశాబ్దాలుగా టీడీపీ కోసం పనిచేస్తున్న కాపు నేతలు ఈసారి పదవులు లేకుండా పోవడానికి జనసేన కారణమని చెప్పక తప్పదు. ఎందుకంటే మంత్రివర్గం కూర్పులో కాపు సామాజికవర్గానికి చెందిన ముగ్గురికి పదవులు లభించాయి. అందులో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన నిమ్మల రామానాయుడు, నెల్లూరుకు చెందిన నారాయణ, శ్రీకాకుళం జిల్లాకు చెందిన అచ్చెన్నాయుడులకు మాత్రమే దక్కాయి. వాసంశెట్టి సుభాష్ కు లభించినా శెట్టి బలిజ కావడంతో కాపులు పరిగణనలోకి తీసుకోరు.
సీనియర్ నేతలున్నా...
తూర్పు గోదావరి జిల్లా టీడీపీలో సీనియర్ నేతలు లేరంటే లేరని కాదు. చాలా మంది ఉన్నారు. నిమ్మకాయల చినరాజప్ప, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, యనమల రామకృష్ణుడు, జ్యోతుల నెహ్రూ, వేగేళ్ల జోగేశ్వరరావు వంటి వారు ఉన్నప్పటికీ వారికి మంత్రి పదవులు దక్కలేదు. జనసేనకు చెందిన పవన్ కల్యాణ్, కందుల దుర్గేష్ వంటి వారికి పదవులు లభించడంతో ఇక టీడీపీలో కాపు సామాజికవర్గానికి చెందిన నేతలకు మంత్రి పదవులు ఇవ్వలేకపోయారు. ఇక నామినేటెడ్ పదవుల విషయంలోనూ తూర్పు గోదావరి జిల్లాలో జనసేనలో ఉన్న కాపు నేతలకే ప్రాధాన్యత దక్కుతుండటంతో కొంత టీడీపీ నేతల్లో అసహనం వ్యక్తమవుతుంది. టీడీపీలో కూటమి ప్రభుత్వం ఉన్నంత కాలం తమకు పదవులు రావని నేతలు డిసైడ్ అయ్యారు.
అన్ని పదవులూ...
ఒకరకంగా చెప్పాలంటే తూర్పు గోదావరి జిల్లాను జనసేనకు రాసిచ్చినట్లే కనపడుతుందని ఒక టీడీపీ సీనియర్ నేత వ్యాఖ్యానించారంటే పరిస్థితికి అద్దం పడుతుంది. పవన్ కల్యాణ్ సూచించిన వారికే తూర్పు గోదావరి జిల్లాలో నామినేటెడ్ పదవుల నుంచి అన్ని రకాల పదవులు లభిస్తుండటంతో ఇక అటు వైపు చూడటం కూడా వృధా అని నేతలు భావించే పరిస్థితికి వచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా తూర్పు గోదావరి జిల్లాలో ప్రభావితం చేయగలనేత పవన్ కల్యాణ్ అని భావించి జనసేనకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లాలోని టీడీపీ నేతలు సైకిల్ ఎక్కి రాజకీయంగా ప్రయాణించడం కంటే గాజు గ్లాసు పట్టుకోవడం మంచిదన్న నిర్ణయానికి వచ్చారు.
ఒకప్పుడు కంచుకోటగా...
తూర్పు గోదావరి జిల్లా అంటే ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. బలమైన ఓటు బ్యాంకు కూడా ఉంది. కేవలం కాపు సామాజికవర్గమే కాకుండా ఆ జిల్లాలో ఉన్న బీసీలతో పాటు మిగిలిన సామాజికవర్గం నుంచి కూడా ఎన్టీఆర్ హయాం నుంచి టీడీపీకి అండగా నిలిచింది. అలాంటి చోట గత ఏడాది కాలం నుంచి టీడీపీ నేతల్లోనూ క్యాడర్ లోనూ నిరాశ నిస్పృహలు అలుముకున్నాయి. కొందరు నేతలు బహిరంగంగానే బయటపడుతున్నప్పటికీ మరికొందరు మాత్రం లోలోపల మదనపడుతున్నారు. అధికారంలో ఉండేందుకు ఇంకా నాలుగేళ్లు సమయం ఉండటంతో వేచి చూద్దామని ధోరణిలో మరికొందరు నేతలున్నారు. అందుకే తమ రాజకీయ భవిష్యత్ ను గోదారిలో కలపవద్దంటూ పార్టీ నేతలు అధినాయకత్వానికి మొరపెట్టుకుంటున్నారు.
Next Story

