Fri Mar 13 2026 14:12:17 GMT+0530 (India Standard Time)
TDP : టీడీపీకి అనుకూల శత్రువు సీఆర్
సీనియర్ నేత సి. రామచంద్రయ్య తెలుగుదేశం పార్టీలో ఉండి కూటమిలోని బీజేపీ పై విమర్శలు చేయడం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది.

సీనియర్ నేత సి. రామచంద్రయ్య తెలుగుదేశం పార్టీలో ఉండి కూటమిలోని బీజేపీ పై విమర్శలు చేయడం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. గత కొన్నాళ్ల నుంచి సీఆర్ పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతున్నారంటున్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని సొంత పార్టీ నేతలే కోరుతున్నారు. ఒక ప్రధాన మీడియాలో మోదీ విదేశాంగ నీతిపై ఆయన రాసిన వ్యాసం ఇప్పుడు టీడీపీలో హాట్ టాపిక్ గా మారింది. ఇలా చూస్తూ వెళుతుంటే పార్టీ నలుగురిలో నవ్వుల పాలు కావడమే కాకుండా ప్రజల్లో చులకన అవుతామన్న భావన కూడా పార్టీ నేతల్లో వ్యక్తమవుతుంది.
టీడీపీ ఎమ్మెల్సీగా ఉండి...
సి.ఆర్ తెలుగుదేశం పార్టీ నుంచే రాజకీయంగా ఎదిగారు. రాజ్యసభ పదవి దక్కింది. ఆయన తెలుగుదేశం పార్టీలోనే ప్రత్యక్ష ఎన్నికల్లో కాకుండా రాజ్యసభ ఎన్నికకావడంతో ఆయన రాజకీయంగా మరింత బలపడేందుకు ప్రయత్నించారు. కడప జిల్లాకు చెందిన బలిజ సామాజికవర్గానికి చెందిన నేత కావడంతో టీడీపీ ఆయనకు పదవుల విషయంలో ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. అయితే 2009 లో ఆయన ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి ఏర్పాటు చేయడంతో అందులోకి వెళ్లారు. తర్వాత చిరంజీవి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడంతో సి. రామచంద్రయ్య కాంగ్రెస్ లో చేరారు. అంతేకాదు ఎమ్మెల్సీ పదవిని కూడా దక్కించుకున్నారు.
సోషల్ మీడియాలో...
తర్వాత కాంగ్రెస్ నుంచి వైసీపీలో చేరారు. వైసీపీ కూడా సి.రామచంద్రయ్యకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించింది. మళ్లీ 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలు కావడంతో సి.రామచంద్రయ్య తిరిగి టీడీపీలో చేరారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినా తిరిగి టీడీపీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. అయితే చాలా రోజుల నుంచి ఆయన టీడీపీ నేతలకు దూరంగా ఉంటున్నారు.ఈ ఏడాది మే నెలలో మహానాడు కడపలో జరిగినా సి. రామచంద్రయ్య దానికి హాజరు కాలేదు. ఇప్పుడు మోదీ ప్రభుత్వం పై నేరుగా విమర్శలు చేయడంతో ఇక చంద్రబాబు ఆయన విషయంలో ఉపేక్షించి లాభం లేదని, వెంటనే చర్యలు తీసుకోవాలంటూ సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. మరి సీఆర్ పై వేటు పడనుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.
Next Story

