Fri Dec 05 2025 23:10:15 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : అసెంబ్లీలో ఈ సీన్లు నిజమేనా? స్వపక్షంలోనే విపక్షం ఎందుకిలా?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలలో కూటమి లో మిత్ర పక్షాలుగా ఉన్న టీడీపీ, జనసేన ల మధ్య మాటల యుద్ధం సాగుతుంది.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలలో కూటమి లో మిత్ర పక్షాలుగా ఉన్న టీడీపీ, జనసేన ల మధ్య మాటల యుద్ధం సాగుతుంది. అయితే ప్రజా సమస్యలపైనే ప్రశ్నిస్తున్నామని వారు చెబుతున్నప్పటికీ ఎక్కడో తేడా కనపడుతుందే అన్న కామెంట్స్ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఈ వర్షాకాల సమావేశాల్లో విచిత్రమైన పరిస్థితి అసెంబ్లీ సమావేశాల్లో చూడాల్సి వస్తుంది. కొన్ని అంశాలపై జనసేన మంత్రులను టీడీపీ ఎమ్మెల్యేలు ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించాలని చూస్తుంటే, జనసేన ఎమ్మెల్యేలు కూడా తామేమీ తక్కువ తినలేదంటూ టీడీపీ మంత్రులు ఇబ్బంది పడే ప్రశ్నలను వేస్తున్నారు. ఫలితంగా ఈ ప్రభావం ప్రభుత్వంపై పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతుంది.
సీనియర్లు ఇలా అయితే...?
అసెంబ్లీ సమావేశాల్లో జనసేన vs టీడీపీ అన్నట్లుగా చర్చలు నడుస్తున్నాయి. తొలుత టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరావు ఇటీవల పొల్యూషన్ కంట్రోల్ బోర్డు విషయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇబ్బంది పడే విధంగా ప్రశ్నలు వేశారు. తాము కాలుష్య నియంత్రణ మండలి అధికారులను కలిసి సమస్యను చెప్పుకుంటే ఉప ముఖ్యమంత్రి ఆదేశాలుండాలని చెబుతున్నారని ఆయన అన్నారు. కాలుష్య నియంత్రణ మండలి సక్రమంగా పనిచేయడం లేదని పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ శాఖపై బొండా ఉమామహేశ్వరరావు నిందలు వేసేందుకు ప్రయత్నించారు. ఇక మరో సీనియర్ సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. రేషన్ బియ్యం విషయంలో ప్రభుత్వం గత ప్రభుత్వ వైఖరినే అనుసరిస్తుందని పరోక్ష వ్యాఖ్యలు చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు.
రహదారులు బాగాలేవని...
తాజాగా తాడేపల్లి గూడెం నియోజకవర్గానికి చెందిన జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ టీడీపీ మంత్రులు నిర్వహిస్తున్న శాఖపై ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ప్రధానంగా తన నియోజకవర్గంలో రహదారులు బాగా లేవని, కాంట్రాక్టరును అడిగితే గతంలో పెండింగ్ లో ఉన్న బిల్లులను చెల్లిస్తే తాము రోడ్ల మరమ్మతులు చేపడతామని అన్నారని, అభివృద్ధి పనులు చేసుకుంటున్నామని చెప్పుకుంటున్న మన ప్రభుత్వం రహదారులను బాగు చేయకపోతే ప్రజల్లో చెడ్డపేరు తెచ్చుకోవాల్సి వస్తుందని అన్నారు. అంటే జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ రాష్ట్రంలో రహదారులు బాగా లేవని అసెంబ్లీ సాక్షిగా పరోక్షంగా అనడంతో ప్రభుత్వం కూడా ఇరుకునపడిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఇవి యధాలాపంగానే జరిగాయా? లేక ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడానికి ఇటువంటి అంశాలు లేవనెత్తుతున్నారా? అన్నది తెలియాల్సి ఉంది.
Next Story

