Sat Dec 13 2025 22:33:18 GMT+0000 (Coordinated Universal Time)
TDP : టీడీపీ అలెర్ట్ కావాల్సిందే.. ఎందుకంటే పరిస్థితి బాగాలేదు బాబయ్యా?
ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం అమలు చేయడంపై దృష్టి సారిస్తుంటే.. నియోజకవర్గాల్లో తెలుగు తమ్ముళ్లు కొట్టుకుంటున్నారు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం అమలు చేయడంపై దృష్టి సారిస్తుంటే.. నియోజకవర్గాల్లో తెలుగు తమ్ముళ్లు కొట్టుకుంటున్నారు. అనేక నియోజకవర్గాల్లో టీడీపీలో గ్రూపులు బయలుదేరాయి. కొత్తగా చేరిన వారికి, పాతగా వచ్చిన వారికి మధ్య గ్యాప్ ఏర్పడింది. ఎన్నికయిన ఎమ్మెల్యేల తప్పిదం కూడా ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఎమ్మెల్యేలు తమకు అనుకూలురైన కొందరికే కాంట్రాక్టు పనులతో పాటు నామినేటెడ్ పదవులను ఇస్తుండటంతో ఇక దక్కని వారు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లాలని భావించినా అది సాధ్యం కావడం లేదు. మత్రి నారా లోకేశ్ కు ఈ విషయం చెప్పాలనుకున్నా అందుకు సమయం చిక్కడం లేదు.
టీడీపీలో వర్గ విభేధాలు...
దీంతో అనేక నియోజకవర్గాల్లో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. పార్టీ అగ్ర నాయకత్వం తప్పిదం లేకపోయినా స్థానిక నాయకత్వం కారణంగానే ఇటువంటి తప్పిదాలు, విభేదాలు ఎక్కువవుతున్నాయని తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలే సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. నియోజకవర్గంలో తాము పడుతున్న ఇబ్బందులు పార్టీ హైకమాండ్ దృష్టికి వెళతాయని వారు సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నారు. దీంతో పార్టీ పరువు రోడ్డున పడుతుంది. అంతే కాదు.. సోషల్ మీడియాలో పడుతున్న వాటిని మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయం కూడా చంద్రబాబు, లోకేశ్ దృష్టికి తీసుకెళ్లడం లేదన్న ఆరోపణలు కూడా చేస్తున్నారు. అసంతృప్తిని కప్పి ఉంచితే అది ఎన్నికల సమయానికి బయటపడుతుందన్న భావన టీడీపీ అభిమానుల్లో వ్యక్తమవుతుంది.
సత్యవేడు నియోజకవర్గంలో...
తాజాగా సత్యవేడు నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను ఆ పార్టీ కార్యకర్త నూతలపాటి హరిప్రసాద్ చౌదరి చేసిన పోస్టు వైరల్ గా మారింది. అతని పోస్టును చూసి చాలా మంది కార్యకర్తలు తమ నియోజకవర్గంలోనూ ఇంతేనని కామెంట్స్ పెడుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. సత్యవేడు ఎమ్మెల్యేగా ఆదిమూలం ఉన్నప్పటికీ అక్కడ హేమలత, గంగాప్రసాద్, నరసింహయాదవ్, మునస్వామియాదవ్, పద్మరాజు నాటి తిరుగుబాటు అభ్యర్థి చెరుకురసం రమేష్ బాబులు పార్టీలో పనిచేసిన వారికి అన్యాయం చేస్తున్నారని హరిప్రసాద్ చౌదరి ఆరోపించారు. పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ గా అధిష్టానం నిర్ణయించిన శంకర్ రెడ్డి టీడీపీ ఓటమి కోసం పనిచేసిన వారిని పక్కన కూర్చొని పెట్టుకొని వారికి ప్రాధాన్యం ఇస్తూన్నారన్నారు. దీంతో పార్టీ కోసం నిజంగా కష్టపడ్డ నాయకుల్లో కష్టాలు అంతర్మధనం ప్రారంభమై తిరిగి గ్రూపు రాజకీయాలు మొదలయ్యాయనిచెప్పారు. ఇదే పరిస్థితి అనేక నియోజకవర్గాల్లో నెలకొందని అనేక మంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
Next Story

