Sat Dec 13 2025 22:31:09 GMT+0000 (Coordinated Universal Time)
Telugu Desam Party : టీడీపీలో థిక్కార స్వరం.. ఇది వేకప్ కాల్.. మేల్కొనకపోతే?
తెలుగుదేశం పార్టీ నలభై ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉంది. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీలో క్రమశిక్షణ కట్టు తప్పుతుంది

తెలుగుదేశం పార్టీ నలభై ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉంది. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీలో క్రమశిక్షణ కట్టు తప్పుతుంది. కొత్త వాళ్లను ఎంపిక చేయడం తాను చేసిన తప్పా? అన్న చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్లో కొంత మాత్రమే నిజముంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సమయంలోనూ ఎన్టీఆర్ ఎందరో కొత్త వాళ్లకు రాజకీయంగా అవకాశం కల్పించారు. అప్పుడు కూడా పార్టీ లైన్ ఎవరూ దాటే ప్రయత్నం చేయలేదు. 1995లో చంద్రబాబు పార్టీని తన చేతుల్లోకి తీసుకున్న తర్వాత కూడా తటస్థులంటూ కొత్త వారికి టిక్కెట్లు ఇవ్వడం జరిగాయి. ఆ ప్రయోగమూ విఫలం కాలేదు. కానీ ఎన్నడూ లేని విధంగా ఈసారి మాత్రం ఎమ్మెల్యేలు అందులోనూ కొత్తగా మొదటి సారి గెలిచిన ఎమ్మెల్యేలు మాత్రమే కట్టుతప్పుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. కానీ క్రమశిక్షణ చర్యలను తీసుకునే పరిస్థితుల్లో పార్టీ నాయకత్వం లేదన్నది వాస్తవం.
కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలే....
కొలికపూడి శ్రీనివాసరావు నుంచి మొదలుపెడితే ఎవరూ ఏమీ తక్కువ కాదన్నట్లు కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, తంబళ్లపల్లి ఇన్ ఛార్జి జయప్రకాష్ రెడ్డి ఇలా ఒక్కరు కాదు.. అనేక మంది యువ ఎమ్మెల్యేలు అనేక వివాదాల్లో వరసగా చిక్కుకుంటున్నారు. మొన్నటి ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడంతో వాటిని సంపాదించుకునేందుకు తపన పడే వారి సంఖ్య ఎక్కువగా కననపడుతుంది. అందులోనూ ఇసుక, మద్యం వంటి అంశాల్లోనూ ఎమ్మెల్యేల జోక్యం ఉండటంతో అధినాయకత్వానికి తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. వారిని ఆపడం ఎలాగో తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి కూడా అంతు చిక్కని సమస్యగా మారింది. అపార రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు సయితం ఏమీ చేయలని పరిస్థితుల్లో ఉన్నారు.
35 శాతం మంది ఎమ్మెల్యేలు...
ఇక తాజాగా 48 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల్లోనూ పాల్గొనడం లేదంటే ఏ రేంజ్ లో వారి థిక్కార స్వరం వినిపపడుతుందో అర్థం చేసుకోవచ్చు. ఎన్నడూ లేనిది తెలుగుదేశం పార్టీలో ఇలాంటి పరిస్థితి రావడానికి నాయకత్వం యాభై శాతం కారణమయితే.. ఎన్నికల్లో పెరిగిపోయిన విపరీతమైన ఖర్చు కూడా మరొక కారణంగా చెప్పాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి నెల పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నా 48 మంది ఎమ్మెల్యేలు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారంటే నాయకత్వాన్ని కేర్ చేయకపోవడమేనని స్పష్టంగా అర్థమవుతుంది. ఇది రానున్న ప్రమాదానికి సంకేతాలుగానేన చెప్పాలి. ఉన్న 135 ఎమ్మెల్యేల్లో 48 మంది ఎమ్మెల్యేలంటే 38 శాతం అస్సలు ప్రభుత్వాన్ని పార్టీని పట్టించుకోలేదనే భావించాలి. వీరంతా సొంత పనులు, వ్యాపారాలకు మాత్రమే పరిమితమయ్యారు. టీడీపీకి నిజంగా ఇది వేకప్ కాల్. దీని నుంచి బయట పడకపోతే ఇబ్బందులు తప్పవు. అందుకే చంద్రబాబు నాయుడు సరైన సమయంలో సరైన నిర్ణయం అని నాన్చకుండా సీరియస్ యాక్షన్ దిగాలని పార్టీ క్యాడర్ కోరుకుంటుంది.
Next Story

