Wed Jan 07 2026 18:46:49 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : కూటమి ఉన్నట్లా.. లేనట్లా.. మనల్ని కాదన్నట్లు దులిపేసుకుంటున్నారా?
తెలుగుదేశం పార్టీకి సీనియర్ల అవసరం ఖచ్చితంగా కనిపిస్తుంది.

తెలుగుదేశం పార్టీకి సీనియర్ల అవసరం ఖచ్చితంగా కనిపిస్తుంది. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా, లేకున్నా కేవలం చంద్రబాబు నాయుడు మీదనే ఆధారపడి ఉండేలా పార్టీ నడిచేది కాదు. కానీ చంద్రబాబు నాయుడు ఇప్పుడు విదేశాలకు వెళ్లినా, మరొకచోటకు అధికార పర్యటనకు వెళ్లినా విపక్షం చేసే విమర్శలకు మాత్రం సూటిగా సమాధానమిచ్చే సీనియర్ నేతలు కొరవయ్యారనే చెప్పాలి. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఒకరిద్దరు నేతలు తప్ప ఎవరూ పెద్దగా పెదవి విప్పడం లేదు. ఇక కొత్తగా వచ్చిన నేతలు ప్రతిపక్ష పార్టీ చేసే విమర్శలకు ఘాటుగా కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు. వారి కౌంటర్లు ప్రజల్లోకి బలంగా వెళ్లలేకపోవడం పార్టీకి మైనస్ గా మారిందన్నది అందరూ అంగీకరిస్తున్నదే.మరొకవైపు కూటమిలో ఉన్న మిత్రపక్షాలు తమను కాదన్నట్లు వ్యవహరించడం చర్చనీయాంశమైంది.
పద్దెనినిమిది నెలల కాలంలో...
కూటమి ప్రభుత్వం ఏర్పాటయి పద్దెనిమిది నెలలు కావస్తుంది. అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వస్తుంది. అలాగే అభివృద్ధి పనులను కూడా అంతేస్థాయిలో ముందుకు తీసుకెళుతుంది. రాష్ట్ర భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని అనేక నిర్ణయాలు తీసుకుంటుంది. మరొకవైపు కూటమి ఉన్నట్లా లేన్నట్లా అన్న అనుమానం కూడా కలుగుతుంది. టీడీపీని కానీ, చంద్రబాబును కానీ విపక్షాలు విమర్శిస్తే అందులో మిత్ర పక్షాలు పెద్దగా పట్టించుకోవడం లేదు. జనసేన నేతలు కానీ, బీజేపీ లీడర్లు కానీ విపక్సాలకు కౌంటర్ ఇవ్వడం లేదు. వారు ఎందుకు మౌనంగా ఉంటున్నారో తెలియదు కానీ కూటమి ప్రభుత్వంపై చేసే విమర్శలకు కూడా టీడీపీ నేతలే కౌంటర్ ఇవ్వాల్సిన దయనీయ స్థితిని చూడాల్సి ఉంది. మెడికల్ ప్రయివేటు కళాళాలల ప్రయివేటీకరణపై కూడా మిత్ర పక్షాల నుంచి పెద్దగా స్పందన రాలేదు.
అనేక అంశాలపై...
నిజానికి చంద్రబాబు విదేశాల్లో ఉన్న సమయంలో భోగాపురం ఎయిర్ పోర్టులో తొలి విమానం ల్యాండ్ అయింది. దీనిపై వైసీపీ తమ ప్రభుత్వ హయాంలో భోగాపురం చాలా వరకూ పూర్తయిందని చెప్పుకుంది. టీడీపీ నేతలు మినహా జనసేన, బీజేపీ నేతలు అసలు స్పందించలేదు. అసలు తమను కాదన్నట్లుగానే వారు వ్యవహరించారు. అలాగే రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా ఒకరిద్దరూ టీడీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు తప్పించి జనసేన, బీజేపీలు తమది కాదన్నట్లు వ్యవహరించడం కూడా రాజకీయంగా చర్చనీయాంశమైంది. అసలు కూటమిలో ఏం జరుగుతుందన్న అనుమానం మాత్రం టీడీపీ నేతల్లో కలుగుతుంది. మరి దీనికి సమాధానం ఎవరు చెబుతారన్నది చూడాలి.
Next Story

