Fri Dec 05 2025 13:43:08 GMT+0000 (Coordinated Universal Time)
Nara Lokesh: నారా లోకేశ్ కు ఇచ్చే పదవి ఏంటో తెలుసా? చంద్రబాబు కీలక నిర్ణయం
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నారా లోకేశ్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు

మహానాడుకు నిర్వహణకు ఇంకా పెద్దగా సమయం లేదు. కడపలో మహానాడు కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ మహానాడుకు ఒక ప్రత్యేకత ఉంది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నారా లోకేశ్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. నారా లోకేశ్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేయాలని ఆయన నిర్ణయించినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేశ్ కొనసాగుతున్నారు. కార్యకర్తలతో మమేకం అవుతున్న లోకేశ్ కు పార్టీలో కీలక పదవి అప్పగించాలన్న నిర్ణయం ఎప్పుడో జరిగిపోయింది. తన రాజకీయ వారసత్వాన్ని చంద్రబాబు కుమారుడు లోకేశ్ కు అప్పగించేందుకు సిద్ధమయ్యారు.
మహానాడు వేదికగా...
మహానాడు వేదికగా ఈ నిర్ణయాన్ని చంద్రబాబు ప్రకటించే అవకాశముంది. ఇకపై పార్టీలో ఏ నిర్ణయమైనా నారా లోకేశ్ చేతుల మీదుగా జరిగేలా తీసుకునేలా చంద్రబాబు నిర్ణయించారు. ముఖ్యంగా భవిష్యత్ లో నారా లోకేశ్ నాయకత్వానికి ఇబ్బందులు లేకుండా పార్టీ కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నారా లోకేశ్ నాయకత్వంలో ఈ నాలుగేళ్లలో పదవిలో ఉంటూ పార్టీని ఒక రేంజ్ లో తీసుకెళుతన్నారు. 2019 ఎన్నికలకు ముందే యువగళం పాదయాత్ర పేరుతో క్యాడర్ తో కనెక్ట్ అయ్యారు. చంద్రబాబు ను మించి నారా లోకేశ్ పార్టీలో నేడు కీలకంగా మారారు. నిత్యం కార్యకర్తలతో మమేకమవుతూ వారి బాగోగులను అడిగి తెలుసుకుంటున్నారు.
అంచనాలు లేకుండానే...
ఎటువంటి అంచనాలు లేకుండా పార్టీలోకి అడుగుపెట్టిన నారా లోకేశ్ పై తొలుత విమర్శలు వినిపించాయి. 2014లో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నారా లోకేశ్ దొడ్డిదారిన మంత్రి పదవి చేపట్టారంటూ విమర్శలు చేశారు. వాళ్ల నోళ్లను మూసివేస్తూ నారా లోకేశ్ తాను 2019 ఎన్నికల్లో ఓటమి పాలయిన మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి అద్భుతమైన విజయం సాధించారు. మంగళగిరి తన అడ్డాగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రిగా కూడా మంచి మార్కులే పొందుతున్న నారా లోకేశ్ చంద్రబాబుకు సాంకేతిక విషయాల్లో సహకరిస్తూ కూటమి ప్రభుత్వాన్ని మరింత ముందుకు తీసుకెళుతున్నారు. వాట్సాప్ లో పౌర సేవలను విస్తృత పర్చడంలో గాని, ఏపీకి కంపెనీలను తేవడంలో కానీ నారా లోకేశ్ సక్సెస్ అవుతున్నారు.
భవిష్యత్ నేతగా...
అందుకే కార్యకర్తల నుంచి మాత్రమే కాకుండా నాయకుల నుంచి కూడా నారా లోకేశ్ నాయకత్వం కావాలంటూ డిమాండ్ సౌండ్ ఇటీవల కాలంలో అధికమయింది. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన కుమారుడిని పార్టీకి పగ్గాలు అప్పగించి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసినట్లుగానే ఇక పార్టీ పగ్గాలు మాత్రం లోకేశ్ చేతిలో పెట్టనున్నారు. ఇందుకు మూడు రోజుల పాటు కడప జిల్లాలో జరిగే మహానాడు వేదికగా మారనుంది. సైకిల్ పార్టీకి భవిష్యత్ నేతగా నారా లోకేశ్ మరింత దూసుకు వెళ్లేందుకు అవసరమైన రోడ్ మ్యాప్ ను చంద్రబాబు ఇప్పటి నుంచే సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా యువత లోకేశ్ కు పార్టీలో కీలక పదవి దక్కుతుందని తెలిసి హ్యాపీ ఫీలవుతున్నారు.
Next Story

