Fri Jan 17 2025 20:05:40 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు మరోసారి ఏమన్నారంటే?
తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలోకి వెళ్లిన కంటైనర్ లో ఏమున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు
తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలోకి వెళ్లిన కంటైనర్ లో ఏమున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. డబ్బులు తరలించడానికే జగన్ కంటైనర్ ను ఉపయోగించుకున్నారని ఆయన ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో డబ్బుతో గెలవాలని జగన్ చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని ఆయన పిలుపు నిచ్చారు. కంటైనర్లో డబ్బులు తీసుకుని యాత్రలో అభ్యర్థులకు చేర్చడానికే జగన్ దానిని ఉపయోగిస్తున్నాడని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఆయన బనగానపల్లిలో మీడియాతో మాట్లాడారు. తొలుత ఆయన టీడీపీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు.
తాడో పేడో తేల్చుకుంటామని...
ఈ ఎన్నికల్లో తాడో పేడో తేల్చుకుంటామని చంద్రబాబు అన్నారు. జగన్ మద్యాన్ని, ఇసుకను విక్రయించి అక్రమంగా సంపాదించిన సొమ్మునంతా ఈ ఎన్నికల్లో ఉపయోగించాలని చూస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఒక దుర్గార్గుడిని ఓడించడానికి అందరం జట్టుకట్టామని తెలిపారు. రాయలసీమ ప్రాజెక్టుల కోసం పన్నెండు వేల కోట్లను తాము ఖర్చు చేస్తే, జగన్ రెండు వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదన్నారు. రానున్న కాలంలో గోదావరి జలాలను తరలిస్తామని తెలిపారు. వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయనని, తేడా చేసిన వారిని మాత్రం తొలగిస్తానని హెచ్చరించారు. అభివృద్ధి, సంక్షేమం సమానంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని ప్రజలకు హామీ ఇచ్చారు.
Next Story