Wed Jul 09 2025 19:55:13 GMT+0000 (Coordinated Universal Time)
"భవిష్యత్ గ్యారెంటీ" : ప్రారంభమైన టీడీపీ బస్సుయాత్ర
మరోవైపు.. టీడీపీ మినీ మేనిఫెస్టోను సిద్ధం చేసి దానిని ప్రజల్లోకి తీసుకెళ్తూనే.. వైసీపీ ప్రభుత్వ పాలనను ఎండగట్టేందుకు..

2024 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ పావులు కదుపుతోంది. ఈ ఏడాది జనవరిలోనే నారా లోకేష్ యువగళం పేరు పాదయాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం లోకేష్ పాదయాత్ర సీమ జిల్లాల్లో కొనసాగుతోంది. మరోవైపు.. టీడీపీ మినీ మేనిఫెస్టోను సిద్ధం చేసి దానిని ప్రజల్లోకి తీసుకెళ్తూనే.. వైసీపీ ప్రభుత్వ పాలనను ఎండగట్టేందుకు "భవిష్యత్ గ్యారెంటీ" పేరుతో బస్సు యాత్ర చేపట్టింది. ఈ మేరకు నియోజకవర్గాలకు ఐదు బస్సులను పంపారు. మంగళవారం ఉంగుటూరు నియోజకవర్గం నుంచి బస్సు యాత్ర ప్రారంభమైంది.
నిడమర్రులో మొదలైన ఈ బస్సుయాత్ర బవయ్యపాలెం వరకూ కొనసాగింది. మాజీ మంత్రి జవహర్ నాయుడు, ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, గోరంట్ల బుచ్చయ్యచౌదరితో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అనంతరం బవయ్యపాలెంలో బహిరంగ సభ నిర్వహించి.. రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలు, మైనింగ్ అంశాలపై మాట్లాడారు. నేడు ఏలూరు, రేపు దెందులూరు 23న నూజివీడు, 24న పోలవరం నియోజకవర్గాల్లో బస్సు యాత్ర జరుగుతుందని టీడీపీ నేతలు తెలిపారు. ఈసారి టీడీపీ పొత్తులేకుండా వస్తుందా ? లేక సింగిల్ గానే పోటీ చేస్తుందా ? అన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదు.
Next Story