Sat Dec 13 2025 22:35:49 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : తానేటి వనిత షాకింగ్ డెసిషన్... ఒక్కసారి కనిపించి పోవమ్మా...?
మాజీ హోం మంత్రి తానేటి వనిత కనిపించడం లేదు.

మాజీ హోం మంత్రి తానేటి వనిత కనిపించడం లేదు. పార్టీ అధికారం కోల్పోయిన నాటి నుంచి ఆమె పెద్దగా రాజకీయంగా యాక్టివ్ గా లేరు. దీనికి ప్రధాన కారణం తనను గత ఎన్నికల్లో కొవ్వూరు నియోజకవర్గం నుంచి తప్పించడమే ప్రధాన కారణంగా తెలుస్తుంది. గత ఎన్నికల్లో ఆమెను కొవ్వూరు నియోజకవర్గం నుంచి గోపాలపురానికి జగన్ మార్చారు. అయితే ఇది ఆమె పనితీరు బాగాలేదని కొవ్వూరు నుంచి మార్చారా? లేక మరేదైనా కారణముందా? అన్న అనుమానం చాలా మందిలో కలుగుతుంది. కొవ్వూరులో ఆమెపై పార్టీలో కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ ఓడిపోయే స్థాయిలో లేదు. అయితే అదే సమయంలో గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై ఉన్న తీవ్ర వ్యతిరేకత ఆమెను నియోజకవర్గాన్ని మార్చడానికి కారణమయ్యాయని వనిత అనుచరులు చెబుతున్నారు.
టీడీపీ నుంచి వచ్చి...
తానేటి వనిత రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి వచ్చారు. విద్యావంతురాలు. ఎమ్మెస్సీ, ఎంఈడీ చేశారు. ఆయన తండ్రి జొన్నకూటి బాబాజీరావు గోపాలపురం ఎమ్మెల్యేగా పనిచేశారు. తానేటి వనిత కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన నేత. ఆమె 2009లో గోపాలపురం నియోజకవర్గం నుంచి టీడీపీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. 2012లో టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన వనిత వైసీపీలో చేరారు. ఆమె జగన్ వెంటే నడిచారు. జగన్ 2104లో తానేటి వనిత పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. అయితే 2014లో కొవ్వూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికల్లో తిరిగి కొవ్వూరు నుంచే విజయం సాధించి జగన్ మంత్రి వర్గంలో పూర్తిస్థాయి మంత్రిగా కొనసాగారు.
ఐదేళ్లు మంత్రిగా...
తొలి మంత్రివర్గంలో మహిళ శిశు సంక్షేమ శాఖను, రెండో దఫా విస్తరణలో వనితకు కీలకమైన హోంశాఖను నిర్వహించారు. అలాంటి తానేటి వనిత ఇప్పుడు అటు కొవ్వూరుకు, ఇటు గోపాలపురం నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారని తెలిసింది. తానేటి వనిత గత పదహారు నెలల నుంచి పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించడం మానేశారు. తిరిగి కొవ్వూరు నుంచి పోటీ చేయడానికి తానేటి వనిత ప్రయత్నిస్తున్నారని తెలిసింది. తన నివాసంలో ఎక్కువగా ఆమె కొవ్వూరు నియోజకవర్గం పార్టీ నేతలు, కార్యకర్తలనే కలుస్తున్నారు. జగన్ నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే పూర్తి స్థాయలో కొవ్వూరు నియోజకవర్గంపై ఫోకస్ పెడతారని భావించినా, జగన్ హయాంలో ఐదేళ్ల పాటు మంత్రిగా ఉన్న తానేటి వనిత కనిపించకుండా పోవడం పై పార్టీలోనే చర్చ జరుగుతుంది.
Next Story

