Fri Dec 05 2025 13:17:54 GMT+0000 (Coordinated Universal Time)
Midhun Reddy : వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ కు రెడీ...ఢిల్లీ చేరుకున్న సిట్ టీం
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో రాజంపేట పార్లమెంటు సభ్యుడు మిధున్ రెడ్డి అరెస్ట్ కు రంగం సిద్ధమయింది.

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో రాజంపేట పార్లమెంటు సభ్యుడు మిధున్ రెడ్డి అరెస్ట్ కు రంగం సిద్ధమయింది. సిట్ అధికారులు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నట్లు సమాచారం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మిధున్ రెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నారు. మద్యం కుంభకోణంలో సంపాదించిన సొమ్మును మిధున్ రెడ్డికి సంబంధించిన కంపెనీలకు మళ్లించారని సిట్ అధికారుల విచారణలో వెల్లడయింది. ఈ నేపథ్యంలోనే గతంలో మిధున్ రెడ్డిని స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం అధికారులు విచారించారు. అయితే ఏపీ లిక్కర్ స్కామ్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సిట్ అధికారులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు.
ఇప్పటికే తొమ్మిది మందిని...
ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా భావించిన రాజ్ కేసిరెడ్డితో పాటు అప్పటి ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసిన ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలతో పాటు మరో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారు ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఈ కేసులో ఇంకా ఛార్జిషీట్ కూడా దాఖలు చేయలేదు. అయితే మిధున్ రెడ్డి ప్రమేయం ఈ కేసులో ఉందని సిట్ అధికారులు గట్టిగా చెబుతున్నారు. ఆయనను అరెస్ట్ చేయాలనుకుంటున్నట్లు ప్రచారం జరగడంతో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు నిరాకరించడంతో మిధున్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
సుప్రీంకోర్టులోనూ...
అయితే సుప్రీంకోర్టులోనూ వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డికి చుక్కెదురయింది. ముందస్తు బెయిల్ పిటీషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అరెస్ట్ చేయకుండా ఈ కేసులో ఛార్జిషీటు ఎలా దాఖలు చేస్తారని న్యాయస్థానం ప్రశ్నించింది. మిధున్ రెడ్డి తరుపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలను వినిపించారు. అది రాజకీయ కుట్రలో భాగంగానే ఈ కేసులు పెట్టిందన్నారు. సిట్ విచారణకు హాజరైన మిధున్ రెడ్డి విచారణకు సహకరిస్తున్నారని పేర్కొంది. అయితే వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసం మిధున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్ ను కొట్టివేసింది. దీంతో మిధున్ రెడ్డి తాను అరెస్ట్ కాకుండా ఉండేందుకు చేసిన అన్ని ప్రయత్నాలు విపలమయ్యాయి.
అరెస్ట్ చేసేందుకు...
దీంతో మిధున్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీలో ఉన్న మిధున్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ఇప్పటికే సిట్ కు సంబంధించిన అధికారుల బృందం బయలుదేరి వెళ్లినట్లు తెలిసింది. సుప్రీంకోర్టులో వచ్చే తీర్పును అనుసరించి తర్వాత చర్యలకు సిద్ధమవ్వాలని భావించి ముందుగానే సిట్ అధికారులు ఢిల్లీకి చేరుకున్నట్లు తెలిసింది. మిధున్ రెడ్డి బెయిల్ పిటీషన ను కొట్టివేయడంతో ఏ క్షణంలోనైనా మిధున్ రెడ్డి అరెస్ట్ అవుతారన్న ప్రచారం జరుగుతుంది. అయితే మిధున్ రెడ్డి వద్ద కూడా మరో ఆప్షన్ లేదు. ఆయన పై ఇప్పటికే ఏపీ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. దీంతో ఏ క్షణంలోనైనా మిధున్ రెడ్డి అరెస్ట్ అవుతారన్న ప్రచారం మాత్రం జోరుగా జరుగుతుంది. అయితే సిట్టింగ్ ఎంపీ కావడంతో ముందుగా లోక్ సభ స్పీకర్ అనుమతి తీసుకుని తర్వాత అదుపులోకి తీసుకునే అవకాశముందని అంటున్నారు.
Next Story

