Sat Dec 06 2025 10:36:51 GMT+0000 (Coordinated Universal Time)
Singanamala : మూడేళ్లకు ముందే ఎన్నికల హీట్ మొదలయినట్లుందిగా?
శింగనమల నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీలు పోటా పోటీగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి

శింగనమల నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీలు పోటా పోటీగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా మూడేళ్లు సమయం ఉండగానే శింగనమలలో ఎన్నికల హీట్ మొదలయిందని చెప్పాలి. ప్రస్తుత ఎమ్మెల్యే,మాజీ మంత్రి ఇద్దరూ చెరొక పార్టీ తరుపున కార్యక్రమాలను చేపట్టడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో కంటే శింగనమలలో ఇప్పటికే పొలిటికల్ హీట్ పెరిగిందంటున్నారు. అనంతపురం జిల్లాలోని శింగనమల నియోజకవర్గం రిజర్వడ్ నియోజకవర్గం. వచ్చే ఎన్నికల నాటికి ఇది రిజర్వ్ డ్ నియోజకవర్గంగా ఉంటుందని చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఈ నియోజకవర్గం ఎలాగైనా మారే అవకాశముంది.
టీడీపీ గెలిచి...
అయితే శింగనమలలో గత ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసిన బండారు శ్రావణి విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి వీరాంజనేయులుపై గెలుపొందారు. గతంలో ఈ నియోజకవర్గం కాంగ్రెస్ కు కంచుకోట. ఆ తర్వాత వైసీపీకి అడ్డాగా మారింది. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన జొన్నలగడ్డ పద్మావతిని పక్కనపెట్టి జగన్ కొత్త ప్రయోగం చేశారు. ట్రక్కు డ్రైవర్ వీరాంజనేయులును పోటీకి దింపారు. రాష్ట్రమంతటా ప్రచారం చేసుకున్నారు. తాను ట్రక్కు డ్రైవర్ కు సీటు ఇచ్చనని, డబ్బులున్న వారికి ఇవ్వలేదని,సామాన్యులకు తమ పార్టీ పెద్దపీట వేస్తుందని పదే పదే చెప్పారు. కానీ శింగనమల ప్రజలు వైసీపీ అభ్యర్థిని ఆదరించలేదు. 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన బండారు శ్రావణికే పట్టం కట్టారు.
సాకే చేరికతో...
కానీ మాజీ మంత్రి, మాజీ పీసీసీ చీఫ్ సాకే శైలజానాధ్ వైసీపీలో చేరిన తర్వాత ఈ నియోజకవర్గంలో వైసీపీ మళ్లీ పుంజుకుంది. శైలజానాధ్ అక్కడే ఉండి ప్రజా సమస్యలపై స్పందిస్తున్నారు. అరటి రైతులకు గిట్టుబాటు ధర లభించలేదని ఆయన కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. ఇక తాజాగా ఒక రైతు మరణించడంతో దానిపై కూడా వైసీపీ, టీడీపీ రాజకీయాలు చేశాయి. అరటి పంట వేసి నష్టపోయి రైతు చనిపోయాడని వైసీపీ నేతలు చెబుతుంటే, టీడీపీ నేతలు మాత్రం ఆర్థికంగా నష్టపోయి ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతున్నారు. రైతు ఆత్మహత్య విషయంలోనూ వైసీపీ, టీడీపీలు రాజకీయంగా తమకు అనుకూలంగా మలచుకోవాలని ప్రయత్నించాయి. రాష్ట్రంలో లేని విధంగా శింగనమలలో రాజకీయ వేడి మూడేళ్ల ముందే ప్రారంభమైంది.
Next Story

