Sun Jun 22 2025 12:51:08 GMT+0000 (Coordinated Universal Time)
Janasena : జనసేన ఎమ్మెల్యేల పెర్ ఫార్మెన్స్ చూసి పవన్ కల్యాణ్ బిత్తరపోయారటగా?
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేలపై చేస్తున్న సర్వేలలో షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయట

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేలపై చేస్తున్న సర్వేలలో షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయట. చాలా మంది ఎమ్మెల్యేలు ప్రజల్లో వ్యతిరేకత ఎదుర్కొంటున్నారని సర్వేల ద్వారా స్పష్టమయిందంటున్నారు. జనసేన నుంచి గత శాసనసభ ఎన్నికల్లో 22 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. పోటీ చేసిన అన్ని చోట్ల విజయం సాధించారు. హండ్రెడ్ పర్సెంట్ స్ట్రయిక్ రేట్ సాధించిన జనసేన వచ్చే ఎన్నికల్లో ఇంకా ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తుంది. అయితే ఎన్నికయిన ఎమ్మెల్యేల్లో దాదాపు పది నుంచి పదిహేను మంది పై తీవ్ర వ్యతిరేకత ఉందని పవన్ కల్యాణ్ నిర్వహించిన సర్వేలో స్పష్టమయిందని చెబుతున్నారు. ఆ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు సక్రమంగా లేదన్న రిపోర్టులు పవన్ కు చేరాయట.
ప్రజాసమస్యలను పరిష్కరించడంలో...
కొత్తగా ఎన్నికయిన ఎమ్మెల్యేలు కావడంతో వారు ప్రజామస్యలను పరిష్కరించడంలో వెనకబడి ఉండటమే కాకుండా అవినీతి ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారని తెలిసి పవన్ నివ్వెరపోయారు. పవన్ కల్యాణ్ ఏరి కోరి నిజాయితీని ప్రధాన అంశంగా తీసుకుని గత ఎన్నికల్లో అభ్యర్థులను ఎంపిక చేశారు. కూటమి హవాలో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేలు అయిన వారికి అవినీతి చేయడం కూడా పెద్ద చేతకావడం లేదని, నేరుగా వారే చేతులు చాస్తుండటంతో ప్రజల్లో పలుచనగా మారిపోయారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ఇందులో మహిళ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని తెలిసింది. దీంతో పాటు కూటమిలోని పార్టీ నేతలు కూడా సహకరించకపోతుండటంతో మరింత పరిస్థితి అద్వాన్నంగా తయారైందన్న నివేదికలు అందాయని తెలుస్తోంది.
ఉత్తరాంధ్రలోని...
ఉత్తరాంధ్ర జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే కు భారీగా ఆస్తులున్నాయి. ఎన్నికలకు ముందే ఆర్థికంగా స్థిరపడిన కుటుంబమే అయినా ప్రతి పనికీ పర్సంటేజీలు దండుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయట. ఆ నియోజకవర్గంలో తొలిసారి జనసేన జెండా ఎగరడాన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో ఎమ్మెల్యేపై ఏ చిన్న అవకాశమొచ్చినా టీడీపీ, బీజేపీ నేతలే ఆ ఎమ్మెల్యేలు తమ అనుచరులతో సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పెడుతూ బద్నాం చేయడానికి ప్రయత్నిస్తున్నారని తెలిసి పవన్ ఒకింత ఆశ్చర్యపోయారట. దీంతో పాటు నియోజకవర్గంలో నామినేటెడ్ పదవుల విషయంలోనూ కూటమి పార్టీల నేతల మధ్య తలెత్తిన మనస్పర్థలు మరింత ఎమ్మెల్యే ప్రతిష్టను దిగజార్చేలా చేస్తున్నాయట.
గోదావరి జిల్లాకు చెందిన...
ఇక గోదావరి జిల్లాలకు చెందిన ఒక ఎమ్మెల్యే పై కూడా ఆరోపణలు అధికంగా వచ్చాయి. తొలినాళ్లలో మంచి పేరు తెచ్చుకుని పవన్ దృష్టిలో పడిన ఆ ఎమ్మెల్యే చేతివాటం మామూలుగా లేదంటున్నారు. ప్రతి పనికీ పర్సంటేజీ దండుకుంటున్నారని తెలిసింది. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన యువకుడయిన ఆయన తన అనుచరులతో బెదిరింపులకు దిగుతూ కాంట్రాక్టర్ల నుంచి బెదిరించి మామూళ్లు వసూళ్లు చేస్తున్నారన్న సమాచారం సర్వేలో తేలింది. దీంతో వచ్చే ఎన్నికల్లో ప్రస్తుతం ఉన్న ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలలో పది నుంచి పన్నెండు మంది ఎమ్మెల్యేలకు టిక్కెట్ దొరకడం కూడా కష్టమన్న అభిప్రాయం జనసేనలో వ్యక్తమవుతుంది. వారి స్థానంలో కొత్తవారిని ఎంపిక చేసే అవకాశాలున్నాయన్న టాక్ పార్టీలో గట్టిగా వినిపిస్తుంది.
Next Story