Fri Dec 05 2025 13:19:09 GMT+0000 (Coordinated Universal Time)
TDP : ఈ ఎమ్మెల్యేలను మార్చాల్సిందేనా? కొత్తవారు వస్తారా?
కూటమి ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత ఏడాదిలోనే అనేక వివాదాలు చోటు చేసుకున్నాయి. ఎమ్మెల్యేలు పార్టీ లైన్ తప్పుతున్నారు

కూటమి ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత ఏడాదిలోనే అనేక వివాదాలు చోటు చేసుకున్నాయి. అయితే ప్రభుత్వ పరంగా కాదు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల కాదు. కేవలం ఎమ్మెల్యేల వల్లనే పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకూ ఎమ్మెల్యేలో చాలా మంది పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తున్నారు. లెక్కలేని తనం వారిలో కనిపిస్తుంది. నియోజకవర్గానికి తామే బాస్ లుగా వ్యవహరిస్తున్నారు. తాము ఎన్నికయింది ఎవరి వల్లనన్నది గుర్తించని పరిస్థితుల్లోకి కొందరు ఎమ్మెల్యేలు వచ్చేశారు. అందుకే టీడీపీ నాయకత్వానికి ఈ ఎమ్మెల్యేలతో ఇబ్బందికరంగా మారింది. నిజానికి చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గత మూడు దఫాలు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు తలెత్తని వివాదాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి.
నాడు ఎమ్మెల్యేలు...
నాడు ఎమ్మెల్యేలు ఒక పద్ధతిని పాటించేవారు. నియోజకవర్గాల్లో ఎలాంటి అవినీతి పనులకు, అక్రమాలకు వేలు పెట్టేవారు కాదు. అవసరమనుకుంటే స్థానిక నియోజకవర్గ ప్రజలకు సాయం చేసి వారి మన్ననలను పొందేవారు. కాకుంటే బయట ప్రాంతాల్లో వ్యాపారాలు చేసుకోవడంతో పాటు ఏదో ఒక పెద్ద పైరవీని చేసుకుని తాము ఎన్నికల్లో ఖర్చు పెట్టుకున్న మొత్తాన్ని తిరిగి రాబట్టుకునే ప్రయత్నం చేసేవారు. అప్పట్లో ఇవేమీ బయటకు వచ్చేవి కావు. కానీ ఇప్పడు ఇలా కాదు. నియోజకవర్గాల్లోనే ఎమ్మెల్యేలు దుకాణాలు తెరిచారు. ఇసుక, మద్యం ఏ విషయంలోనూ వేలు పెట్టకుండా ఉండలేకపోతున్నారు. నియోజకవర్గం ప్రజల వద్దనే చేతులు కూడా చాచేవారు కూడా లేకపోలేదు. దీనికి తోడు హంగామా, అనుచరుల ముందు ఎమ్మెల్యే అని చెప్పుకోవడానికి చేస్తున్న వీరంగం చేస్తున్నారు.
కంట్రోల్ చేయడం ....
వీరిని కంట్రోల్ చేయడం నాయకత్వానికి కూడా సాధ్యం కాదు. అలవాటు పడిన ప్రాణం ఊరికే ఉండదు.అందుకే ఎమ్మెల్యేలు చేసిన తప్పులను ఒక్కొక్కటిగా నాయకత్వం లెక్క పెట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల పనితీరుపై నివేదికలు తెప్పించుకుంటున్నారు. పార్టీ నుంచి సస్పెండ్ చేసుకుంటూ పోతే చాలా మందిని చేయాల్సి వస్తుంది. అందుకే వార్నింగ్ లతో సరిపెడుతున్నారు. అయితే ప్రస్తుతం ఉన్నఎమ్మెల్యేల్లో చాలా మందికి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు దొరకడం కూడా కష్టమేనని అంటున్నారు. మొన్నటి ఎన్నికల్లోనే చంద్రబాబు సీనియర్ నేతలను నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టారు. ఈసారి ఇప్పుడు వివాదాల్లో చిక్కుకుంటున్న వారికి మాత్రం నో టిక్కెట్ అన్నది పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్. కార్యకర్తల అభిప్రాయం కూడా ఇలాగే ఉండటంతో నాలుగేళ్లు వీరు ఏం చేసినా వార్నింగ్ లతో సరిపెట్టాల్సిందే. అంతే తప్ప చర్యలుండవు. అసలు చర్యలు ఎన్నికల్లోనే.
Next Story

