Sat Dec 13 2025 14:00:55 GMT+0000 (Coordinated Universal Time)
Ys Viveka : వైఎస్ వివేకా హత్య కేసులో చిక్కుముడులు అసలు తొలుగుతాయా?
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి ఏడేళ్లు కావస్తుంది

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి ఏడేళ్లు కావస్తుంది. ఇప్పటి వరకూ హత్యకు గల కారణాలు.. హత్య చేసిందెవరన్నది తేల్చలేకపోయారు. వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఒంటరి పోరాటం చేస్తున్నారు. అదీ న్యాయ పోరాటం చేస్తున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో తనకు న్యాయం జరగలేని చెప్పిన సునీతకు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా న్యాయం జరగకపోవడం ఏంటని సునీత ఆలోచించాల్సి ఉంది. అయితే ఇందులో ఆధారాలు లభించలేదా? లేక ఆధారాలను చెరిపేయడంతో విచారణలో అసలు వాస్తవాలు బయటకు రావడం లేదా? మరి దేశంలోనే అనేక క్లిష్టమైన కేసులను పరిష్కరించిన సీబీఐ వల్ల కూడా కావడం లేదంటే అసలు ఈ కేసులో ఏం జరుగుతుందన్నది అందరి మదిలో తలెత్తే ప్రశ్నలే.
కూటమి ప్రభుత్వంలోనూ...
ఒక హత్య జరిగితే వెంటనే దానికి గల కారణాలను, నిందితులను ఎక్కడున్నా పట్టుకునే దర్యాప్తు అధికారులు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మిస్టరీని ఎందుకు ఛేదించలేకపోతున్నారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. నిజానికి ఆధారాలున్నా.. ఏమాత్రం సాంకేతికమైన చిన్నపాటి క్లూ లు లభించినా దర్యాప్తు అధికారులు వదిలిపెట్టే ప్రశ్న ఉండదు. కానీ వివేకానంద రెడ్డి హత్య జరిగింది 2019లో. ఏడేళ్లుగా కుమార్తె డాక్టర్ సునీత పోరాటం చేస్తుంది. అందులోనూ కూటమి ప్రభుత్వం అస్సలు ఊరుకోదు. తాజాగా సీబీఐని న్యాయస్థానం కూడా ఈ కేసులో కొంత వరకే దర్యాప్తు జరపాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈసారి దర్యాప్తులోనైనా అసలు కారణం అనేది బయటపడుతుందా? అన్నది అందరిలో కలిగే సందేహం. ఈ కేసులో కొందరిని అనుమానితులగా అరెస్ట్ చేసినా వారు అసలు వారు కాదన్నది సునీత వాదన.
ఏడేళ్లుగా అనేక ప్రచారాలు...
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అనేక విషయాలు గత ఏడేళ్లుగా ప్రచారంలో ఉన్నాయి. అవన్నీ కట్టుకధలే. వాటికి ఎటువంటి ఆధారాలు లేవు. ఒక మాజీ ముఖ్యమంత్రి సోదరుడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురయి ఇన్నేళ్లవుతున్నా కనీసం హత్యకు గల కారణాలను బయట ప్రపంచానికి తెలియకపోవడంతో ఇక దర్యాప్తు సంస్థలపై కూడా ప్రజలకు దురభిప్రాయం ఏర్పడే అవకాశముంది. అలాంటి వారికే న్యాయం జరగనప్పుడు ఇక సామాన్యులకు సరైన న్యాయం ఎందుకు జరుగుతుందన్న ప్రశ్న తలెత్తుతుంది. వైఎస్ వివేకానందరెడ్డిది సహజ మరణం కాదు. ఖచ్చితంగా హత్యే. కానీ అందుకు గల కారణాలు ఇప్పటి వరకూ తెలియకపోవడం నిజంగా బాధాకరం. శోచనీయం.
Next Story

