Thu Mar 27 2025 03:25:07 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : తర్వాత అరెస్ట్ కు రంగం సిద్ధమయిందా? ఈసారి ఆయనేనటగా
ఆంధ్రప్రదేశ్ లో వరస అరెస్ట్ లు వైసీపీ నేతలను భయపెడుతున్నాయి. ఇప్పటికే అనేక మంది అరెస్టయ్యారు

ఆంధ్రప్రదేశ్ లో వరస అరెస్ట్ లు వైసీపీ నేతలను భయపెడుతున్నాయి. ఇప్పటికే అనేక మంది అరెస్టయ్యారు. కొందరు జైలుకు వెళ్లి బెయిల్ పై బయటకు వచ్చారు. మరికొందరు ఇంకా జైలులోనే రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఇప్పటికే మాచర్లమాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ లు జైలుకు వెళ్లి బెయిల్ పై బయటకు వచ్చారు. తర్వాత కొన్ని రోజుల క్రితం గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తాజాగా సినీ నటుడు పోసాని కృష్ణమురళికి రైల్వే కోడూరు కోర్టు పథ్నాలుగు రోజులు రిమాండ్ విధించింది. దీంతో పోసాని తర్వాత ఎవరు అరెస్ట్ అవుతారన్న దానిపై వైసీపీలో జోరుగా చర్చ జరుగుతుంది.
టీడీపీ, జనసేన క్యాడర్ నుంచి...
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పాటయిన నాటి నుంచి టీడీపీ, జనసేన క్యాడర్ నుంచి ఒకటే డిమాండ్ వినపడుతుంది. తమ అధినేతలను,వారి కుటుంబాలను కించపర్చే విధంగా మాట్లాడిన వారిని ఇంకా ఎందుకు లోపలెయ్యలేదంటూ తెలుగు తమ్ముళ్లు ఆవేశంగా ప్రశ్నిస్తున్నారు. అయితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని, తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని చంద్రబాబు చెబుతూ వస్తున్నారు. కానీ తొమ్మిది నెలలవుతున్నా తమ అధినేతలను, కుటుంబ సభ్యలను కించపర్చిన వారిని అరెస్ట్ చేయకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అరెస్ట్ చేయాలంటూ నిలదీస్తున్నారు. నిజంగా ఇది అధికారంలో ఉన్న నేతలపై కొంత ఒత్తిడి పెరిగిందనే చెప్పాలి.
పోసాని తర్వాత...
కానీ ఇప్పుడు పోసాని తర్వాత ఎవరు అరెస్ట్ అవుతారన్న దానిపై పెద్దయెత్తున ఊహాగానాలు చెలరేగుతున్నాయి. మాజీ మంత్రి కొడాలి నాని ఇందులో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారని చెబుతున్నప్పటికీ, ఈసారి మాత్రం చిత్తూరు జిల్లాకు చెందిన ఒక నేతను అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అనంతపురం జిల్లాకు చెందిన హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. మార్చి 5వ తేదీన విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే గోరంట్ల మాధవ్ కంటే ముందుగా రెడ్డి సామాజికవర్గం నేత ఒకరిని అరెస్ట్ చేసే అవకాశముందని టీడీపీ క్యాడర్ పెద్దయెత్తున చర్చ జరుగుతుంది.
అనేక కేసులు...
ఇప్పటికే సదరు నేతపై అనేక కేసులు నమోదయి ఉండటంతో పాటు అనేక అక్రమాలు గత ప్రభుత్వ హయాంలో జరిగాయన్న నిర్ధారణకు రావడంతో త్వరలోనే అరెస్ట్ కు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. అదే జరిగితే వైసీపీలో ఒక కుదుపు కుదిపినట్లే అవుతుంది. ఎందుకంటే బడా నేతను అరెస్ట్ చేయడంతో టీడీపీ నేతలతో సుదీర్ఘకాలం వైరం ఉన్న ఆ నేత పనిపట్టాలని చిత్తూరు జిల్లా టీడీపీ నేతలు కూడా పట్టుబడుతున్నారు. దీంతో త్వరలోనే ఆ నేతను అరెస్ట్ చేసే అవకాశముంది. ప్రస్తుతం కృష్ణా, గుంటూరు జిల్లాలకే పరిమితమయిన అరెస్ట్ ల పర్వం చిత్తూరు జిల్లాకు పాకే అవకాశముందని తేలడంతో ఫ్యాన్ పార్టీలో కొంత అలజడి రేగిందనే చెప్పాలి. మొత్తం మీద వరస అరెస్ట్ లతో వైసీపీ నేతలు భయపడిపోతున్నారు.
Next Story