Fri Dec 05 2025 19:09:13 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : పాపం.. సత్తిబాబును అలా ఆటాడేసుకుంటున్నారేమిటో?
వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అందరితోనూ కలుపుగోలుగా ఉంటారు.

వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అందరితోనూ కలుపుగోలుగా ఉంటారు. ఆయన గతంలోనూ పవన్ కల్యాణ్ తోనూ టీడీపీ నేతలతోనూ కరచాలనం చేస్తూ కనిపించారు. మిగిలిన వైసీపీ నేతలు దూరంగా ఉన్నప్పటికీ బొత్స సత్యనారాయణ మాత్రం పెద్దరికం వల్లనో ఏమో తెలియదు కానీ తనకు ఎదురుపడిన నేతలు ఎవరినైనా ఆప్యాయంగా పలకరించే తత్వం ఆయనది అంటారు. సత్తిబాబు ఈ రకమైన చర్యలతో అనేక సార్లు సొంత పార్టీ నుంచి ఇబ్బందులు పడ్డారు. గతంలో జగన్ ను దూషించిన పవన్ కల్యాణ్ తో కరచాలనం చేసినప్పుడు కూడా బొత్స సత్యనారాయణపై వైసీపీ సోషల్ మీడియాలో పెద్దయెత్తున విమర్శలు వినిపించాయి. పవన్ తో ఆ నవ్వులేంటి? ఆ షేక్ హ్యాండ్ లు ఏంటి అని నేరుగానే ప్రశ్నించారు.
వైఎస్ షర్మిలతో...
తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై విజయవాడలో జరిగిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లోనూ ఆయన మరొకసారి సొంత పార్టీ క్యాడర్ నుంచి విమర్శలను ఎదుర్కొంటున్నారు. శాసనమండలిలో వైసీపీ పక్ష నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ పై వైసీపీ అధినేత జగన్ సోషల్ మీడియాలో పెద్దయెత్తున పోస్టింగ్ లు కనపడుతున్నాయి. ఈ సమావేశంలో వేదికపైకి వచ్చిన వైఎస్ షర్మిలను సాదరంగా ఆహ్వానించి తన పక్కన కూర్చోబెట్టుకోవడమే కాకుండా ఆమెతో నవ్వుతూ మాట్లాడటం వైసీపీ కార్యకర్తల్లో బొత్స సత్యనారాయణపై ఆగ్రహం కనిపిస్తుంది. బొత్సకు వ్యతిరేరకంగా వైసీపీ సోషల్ మీడియాలో పెద్దయెత్తున విమర్శలతో కూడిన కామెంట్స్ పెడుతున్నారు.
మర్యాదపూర్వకంగానే...
అయితే బొత్స సత్యనారాయణ తన పెద్దరికం కాపాడుకోవడానికే వేదికపైకి వచ్చిన షర్మిలను తన పక్కన కూర్చోవాలని సూచించారని చెబుతున్నారు. బొత్స సత్యనారాయణ సీనియర్ నేత. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ చీఫ్ గా కూడా ఆయన వ్యవహరించారు. వైఎస్ కాలంలోనూ తర్వాత మంత్రిగా పనిచేశారు. ఆయనకు రెండు రాష్ట్రాల్లోని రాజకీయ నేతలతో సత్సంబంధాలున్నాయి. మర్యాదపూర్వకంగానే వేదికపైన తన వద్దకు రమ్మని పిలిచారని అంటున్నారు. అందరినీ బొత్స సత్యనారాయణ శత్రువులుగా చూడరు. అయితే ప్రస్తుతం వైఎస్ షర్మిల, వైఎస్ జగన్ ల మధ్య వైరం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఘటన జరగడంతో బొత్స సత్యనారాయణ పార్టీ నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నాడు. పెద్దాయన అలా ఎందుకు చేశారో తెలియకుండా నెగిటివ్ కామెంట్స్ చేస్తే ఎలా అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద బొత్స సత్యనారాయణ మరోసారి వైసీపీలో వివాదానికి కేంద్ర బిందువుగా మారారు.
Next Story

