Fri Dec 05 2025 13:34:39 GMT+0000 (Coordinated Universal Time)
Nimmala Kishtappa :అత్యాశకు పోతే అడ్రస్సు గల్లంతయిందిగా...ఉనికి కోల్పోయే పరిస్థితి వచ్చిందిగా?
తెలుగుదేశంపార్టీలో సీనియర్ నేతలు ఒక్కొక్కరు కనుమరుగవుతున్నారు. కనపడకుండా పోతున్నారు

తెలుగుదేశంపార్టీలో సీనియర్ నేతలు ఒక్కొక్కరు కనుమరుగవుతున్నారు. కనపడకుండా పోతున్నారు. ఇక వారి రాజకీయాలకు దాదాపుగా ఫుల్ స్టాప్ పడినట్లే. టీడీపీలో కొత్తరక్తం కోసం అధినాయకత్వం ప్రయత్నిస్తుండటం, నవతరం రాజకీయాల్లోకి వస్తుండటంతో పాతతరం నాయకులు ఫేడ్ అవుటవుతున్నారు. అటువంటి వారిలో హిందూపురం మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప ఒకరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం హయాంలో మంత్రిగా, తర్వాత పార్లమెంటు సభ్యుడిగా తిరుగులేని నేతగా తెలుగుశం పార్టీలో కొనసాగిన నిమ్మల ఆశలపై గత ఎన్నికలు నీళ్లు చల్లినట్లయింది. అత్యాశ ఆయన కొంప ముంచిందని, అసలుకే ఎసరు వచ్చిందన్న కామెంట్స్ కూడా పార్టీలో బాగా వినిపిస్తున్నాయి.
సుదీర్ఘకాలంగా టీడీపీలోనే...
తెలుగుదేశం పార్టీలో సీనియర్ రాజకీయ నేతల్లో నిమ్మల కిష్టప్ప ఒకరు. సుదీర్ఘ కాలంగా టీడీపీలో ఒక వెలుగువెలిగారు. వివాద రహితుడిగా పేరు. అధి ష్టానానికి నమ్మిన బంటు.. 1994, 1999లో అసెంబ్లీకి ఎన్నికైన ఆయన ఆయా వర్గాల అభ్యన్నతికి పాటు పడ్డారంటారు. అప్పుడే మంత్రిపదవి లభించింది. నాడు ఉమ్మడి జిల్లాలో తెలుగుదేశం పార్టీలో తిరుగులేని నేతగా పేరు పొందారు. నాడు రద్దయిన గోరంట్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న ఆయన 2004 ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే చంద్రబాబు 2009లో ఆయనకు హిందూపురం ఎంపీ సీటు ఇచ్చారు. ఇక, 2009, 2014 ఎన్నికల్లో హిందూపురం ఎంపీగా విజయం సాధించారు.. గ్రుపులు, వర్గాల రాజకీయాలకు ఆయన చాలా దూరంలో ఉంటారని పేరు.
అత్యాశే అటు ఇటు కాకుండా...
2014లో ఆయనకు పుట్టిన బుద్ధి రాజకీయంగా ఇబ్బందులు తెచ్చిందంటారు. తాను ఎంపీ బరి నుంచి తప్పుకొని అసెంబ్లీకి పోటీ చేయాలని భావించారు.ఎన్నికల్లో ఎలాగైనా అసెంబ్లీకి పోటీ చేసి మంత్రి అవ్వాలన్నది ఆయన ప్రయత్నం. అంతేకాదు ఎన్నికల్లో తన రాజకీయ వారసుడిని కూడా రంగ ప్రవేశం చేయించాలని భావించారురు. ఈ క్రమం లోనే జిల్లాలోని పెనుకొండ, పుట్టపర్తి నియోజకవర్గాలపై కాలు పెట్టారు. . తన ఎంపీ నిధులతో ఆయన ఇక్కడ అభివృద్ధి కూడా చేయించారు. ఆ నియోజకవర్గాల్లోని టీడీపీ ఎమ్మెల్యేలకు ఎంపీ కిష్టప్పకు అస్సలు పడ లేదు. పార్టీ అధినాయకత్వానికి నాడు నిమ్మల కిష్టప్ప పై ఫిర్యాదులు కూడా చేశారంటారు.
చికాకు పుట్టించడంతో...
చికాకు పుట్టిన చంద్రబాబుకు 2024 ఎన్నికల్లో దూరం పెట్టారు. ఆయనకు ఎంపీ టిక్కెట్ గల్లంతయింది. ఆయన కోరుకున్నట్లు వారసుడిని పార్టీ చేరదీయలేదు. చంద్రబాబు జరిపించిన సర్వేల్లో నిమ్మల కిష్టప్పకు మైనస్ మార్కులు రావడంతో పాటు పెనుకొండ టిక్కెట్ ను సవితకు ఇవ్వాల్సి రావడంతో బీకే పార్థసారధికి హిందూపురం టిక్కెట్ కేటాయించారు. ఇప్పుడు అది పాయె.. ఇది పాయె అన్నట్లు తయారయింది నిమ్మల కిష్టప్ప పరిస్థితి. అయితే 2026లో జరగనున్న నియోజకవర్గ పునర్విభజన జరిగితే తన కుటుంబానికి తిరిగి ప్రాధాన్యత లభిస్తుందన్నఆశతో నిమ్మల కిష్టప్ప ఉన్నట్లు తెలిసింది. అప్పటి వరకూ వెయిట్ చేయడమే తప్ప ఇప్పుడు చేయగలిగిందేమీ లేదు.
Next Story

