Sat Dec 06 2025 02:31:03 GMT+0000 (Coordinated Universal Time)
Health and Education Schemess : ఈ పథకాలు ఇక అమలు చేయడం కష్టమేనా? అందుకేనా ఈ తిరకాసు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు భారంగా మారినట్లు కనిపిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు భారంగా మారినట్లు కనిపిస్తున్నాయి. అందుకే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పథకాలకు నిధులను కేటాయించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2004లో ముఖ్యమంత్రి బాధ్యతలను చేపట్టిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి తొలిసారిగా రైతులకు ఉచిత విద్యుత్తు ప్రవేశపెట్టారు.అలాగే సామాన్య ప్రజలకు కార్పొరేట్ వైద్య సేవలు అందించాలని ఆరోగ్యశ్రీని తెచ్చారు. పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించాలని ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకాన్ని తెచ్చిపెట్టారు. 2004 నుంచి 2014 వరకూ కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉండటంతో పాటు వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించినా ఈ పథకాలను కొనసాగించారు. వీటికి నాటి ప్రభుత్వం నిధులను కేటాయించింది.
రాష్ట్ర విభజన జరిగిన తర్వాత...
కానీ ఆ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయాయి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులకు ఉచిత విద్యుత్తు మాత్రం కొనసాగిస్తూనే నేటి వరకూ కొనసాగిస్తున్నాయి. కానీ ఆరోగ్య శ్రీ పథకంతో పాటు ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకాల విషయంలో మాత్రం 2014 నుంచి వచ్చిన ప్రభుత్వాలు వాటికి నిధులను విడుదల చేయడంలో జాప్యం చేస్తున్నాయి. అది ఏపీలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కావచ్చు. తెలంగాణలో నాటి బీఆర్ఎస్ కావచ్చు.. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు.. నిధులను విడుదల చేయడంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నాయి. పథకాల అమలులో లోపాలు ఉండవచ్చు. అవినీతి ఉండవచ్చు. కానీ ప్రజలకు ఉపయోగపడే పథకాలకు నిధులను విడుదల చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
ఆరోగ్య శ్రీని ఏపీలో ఎత్తివేస్తూ...
ఆంధ్రప్రదేశ్ లో అయితే తాజాగా ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రభుత్వం ఎత్తివేసింది. ఎన్టీఆర్ ఆరోగ్య భరోసా కింద కొత్త పథకాన్ని తెచ్చింది. ఇది ప్రభుత్వంపై భారం పడకుండా కేవలం బీమా సంస్థలు చెల్లించేలా కొత్త పథకాన్ని ప్రారంభించారు. అయితే ఆరోగ్యశ్రీ బకాయీలను తమకు రెండు వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉందని, బీమా మొత్తం ఆ కంపెనీలకు ఎలా చెల్లిస్తారని ప్రయివేటు ఆసుపత్రుల యాజమాన్యం ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. తమకు చెల్లించలేని స్థితిలో ఉన్న ప్రభుత్వం బీమా సంస్థలకు ఎలా ప్రీమియం చెల్లిస్తుందని నిలదీస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిచిపోయాయి. నిన్నటి నుంచి ఓపీ సేవలను ప్రయివేటు ఆసుపత్రులు బంద్ చేశాయి. వారంలోగా సమస్య పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశాయి.
తెలంగాణలో ఆరోగ్య శ్రీ సేవలు...
తెలంగాణలో ప్రయివేటు ఆసుపత్రుల యాజమాన్యం కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేయాలని నిర్ణయించింది. ఇప్పటికే తమకు బకాయీలున్న పథ్నాలుగు వందల కోట్ల రూపాయలను వెటనే చెల్లించాలని ప్రయివేటు ఆసుపత్రుల యాజమాన్యం కోరుతుంది. ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో ఆరోగ్య శ్రీ సేవలను నేటి నుంచి బంద్ చేయాలని నిర్ణయించాయి. చర్చలు విఫలం కావడంతో... ప్రయివేటు ఆసుపత్రుల యాజామాన్యం ఆరోగ్య శ్రీ బకాయీలపై గత ఇరవై రోజులుగా చర్చలు జరుపుతుంది. అయితే చర్చలు కొలిక్కి రాలేదు. దీంతో ఈరోజు అర్ధరాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేయాలని ప్రయివేటు యాజమాన్యం నిర్ణయించింది. తెలంగాణలో మొత్తం 33 ఆసుపత్రులకు ఏడాదిగా బకాయీలు పెండింగ్ లో ఉన్నాయని అసోసియేషన్ చెబుతుంది.
ఫీజు రీఎంబర్స్ మెంట్ విషయంలో...
ఫీజు రీఎంబర్స్ మెంట్ విషయంలోనూ రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు సకాలంలో చెల్లించకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు అవస్థలు పడుతున్నారు. ఈ రెండు పథకాల్లో పెద్దయెత్తున అవినీతి జరుగుతుందని ప్రస్తుత ప్రభుత్వాలు భావిస్తున్నాయి. అవినీతి జరగకుండా, కరప్షన్ కు పాల్పడకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి కానీ, నిధులు ఆపేస్తే సేవలు నిలిచిపోతే ఇబ్బంది పడేది ప్రజలు కదా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. లోపాలను సరిదిద్దలేని ప్రభుత్వం కొత్త పాలసీలను తీసుకు రావడం సరికాదంటున్నారు. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఫీజు రీఎంబర్స్ మెంట్ విషయంలో కొత్త నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇకపై ఈ నిధులను నేరుగా తల్లిదండ్రుల ఖాతాల్లో వేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అంతవరకూ ఓకే గాని.. పూర్తిగా పథకాలను నిలిపేస్తే ఇబ్బందులు పడేది ప్రజలు అన్నది గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల సమయంలో ఆ యా పార్టీల అధినేతలు ఇచ్చిన హామీలను అమలుచేయడానికి ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వాలు విద్య, వైద్యం కోసం ఉపయోగపడే పథకాలను మాత్రం నీరుగార్చేలా చర్యలు తీసుకుంటున్నాయి.
Next Story

