Sun Apr 20 2025 20:07:41 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : విజయసాయిరెడ్డి స్థానంలో ఎవరు? ఆయనకే ఛాన్స్ ఉంటుందటగా?
ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ ఎన్నికకు సంబంధించి షెడ్యూల్ విడుదలయింది.

ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ ఎన్నికకు సంబంధించి షెడ్యూల్ విడుదలయింది. వైసీపీ ఎంపీ గా ఉన్న విజయసాయిరెడ్డి రాజీనామాతో ఏర్పడిన ఖాళీగా ఉన్న స్థానాన్ని ఎన్నికల కమిషన్ భర్తీ చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 29వ తేదీ వరకూ ఈ ఎన్నిక కోసం నామినేషన్లను స్వీకరించనున్నారు. 30వ తేదీన నామినేషన్లను పరిశీలించనున్నారు. మే 2వ తేదీ వరకూ నామినేషన్ల ఉపసంహరణకు గడువుగా నిర్ణయించారు. మే 9వ తేదీన ఎన్నికను నిర్వహించనున్నారు. అదే రోజు ఐదు గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరగనుంది. దీంతో ఈ స్థానానికి ఎవరు ఎంపిక అవుతారన్న దానిపై పెద్దయెత్తున చర్చ మొదలయింది.
టీడీపీ తమకు కావాలంటూ...
ఇప్పటికే అనేక మంది ఆశావహులు మూడు పార్టీల్లోనూ ఉన్నారు. ఇప్పటి వరకూ రాజ్యసభలో జనసేనకు ప్రాధాన్యత లేదు. అయితే ఈసారి జనసేనకు అవకాశమిస్తారా? లేదా టీడీపీ ఈ స్థానం తీసుకుంటుందా? అన్నది చూడాలి. మరోవైపు రాజ్యసభలో తాను సొంతంగా బలం పెంచుకోవడానికి బీజేపీ ఈ రాజ్యసభ స్థానాన్ని కోరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే విజయసాయిరెడ్డిని ఒప్పించి రాజీనామా చేయించింది బీజేపీ కావడంతో ఆ స్థానాన్ని తమకే ఇవ్వాలని బీజేపీ కోరనుంది. అయితే ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు అవకాశం కల్పించాము కాబట్టి ఈ స్థానాన్ని తమకు ఇవ్వాలని టీడీపీ కోరనున్నట్లు తెలిసింది.
జనసేన కూడా ప్రయత్నం...
మరొకవైపు జనసేనకు రాజ్యసభలో అభ్యర్థులు ఎవరూ లేకపోవడంతో ఆ పార్టీ కూడా ఈ స్థానాన్ని కోరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే చివరకు బీజేపీదే పై చేయి అవుతుందన్నది రాజకీయ విశ్లేషకుల అంచనాగా వినిపిస్తుంది. ప్రస్తుతం రాష్ట్ర రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పనులు త్వరిత గతిన పూర్తి కావాలంటే కొన్ని పదవులు త్యాగం చేయాల్సి వస్తుందని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే బీజేపీకే విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన స్థానాన్ని ఇచ్చే అవకాశముందన్న అంచనాలు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈరోజు ఢిల్లీకి వెళుతున్న చంద్రబాబు నాయుడు కేంద్ర పెద్దలతో మాట్లాడే అవకాశముందని కూడా చెబుతున్నారు.
సాయిరెడ్డి ఒకే అంటే...
మరొక వైపు ఈ స్థానంలో తిరిగి విజయసాయిరెడ్డి పోటీ చేసే విషయాన్ని కూడా కొట్టిపారేయాలేమంటున్నారు. గతంలో వైసీపీ రాజ్యసభ పదవికి రాజీనామా చేసిన ఆర్. కృష్ణయ్య తరహాలోనే విజయసాయిరెడ్డి కూడా తిరిగి బీజేపీలో చేరి రాజ్యసభకు పోటీ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం పెద్దయెత్తున జరుగుతుంది. అదే జరిగితే విజయసాయిరెడ్డికే తిరిగి బీజేపీ టిక్కెట్ ఇచ్చే అవకాశాలున్నాయి. విజయసాయిరెడ్డికి బీజేపీ ఢిల్లీ పెద్దలతో ఉన్న సంబంధాలతో ఈ ప్రచారం నిజమయ్యే అవకాశాలు లేకపోలేదు. విజయసాయిరెడ్డి కాకుంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ నుంచి మరో కీలక నేతను ఈ పదవికి ఎంపిక చేసే అవకాశాలున్నాయన్నది అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
Next Story