Fri Dec 05 2025 14:59:05 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : నేడు తిరుమలలో భక్తుల రద్దీ బుధవారం ఎలా ఉందంటే?
తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. బుధవారం అయినా భక్తుల రద్దీ ఏ మాత్రం తగ్గలేదు

తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. బుధవారం అయినా భక్తుల రద్దీ ఏ మాత్రం తగ్గలేదు. చల్లటి వాతావరణం ఉండటంతో పాటు భారీ వర్షాలు పడుతున్నప్పటికీ భక్తుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఎక్కువ సంఖ్యలో భక్తులు తిరుమలకు వచ్చి ఏడుకొండల వాడికి మొక్కులు తీర్చుకుంటున్నారు. గత వారం రోజుల నుంచి తిరుమలకు భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు.
సామాన్య భక్తులకు సత్వర దర్శనం...
సామాన్య భక్తులకు సత్వరం స్వామి వారి దర్శనం చేసుకునేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులుఇబ్బంది పడకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా లడ్డూ కౌంటర్లు, అన్న ప్రసాదం కేంద్రం వద్ద భక్తుల తాకిడి ఎక్కువగా ఉండటంతో అవసరమైన చర్యలను దేవస్తానం అధికారులు ఏర్పాట్లు చేశారు. వేసవి సెలవులు పూర్తి కావస్తుండటంతో తిరుమలకు భారీగా భక్తులు తరలి వస్తున్నారని అధికారులు చెబుతున్నారు.
31 కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం నాలుగు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 82,597 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 30,803 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయ 3.52 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

