Sat Dec 13 2025 22:33:19 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : ఈరోజు తిరుమలకు భక్తుల రద్దీ ఇంతగా పెరగడానికి కారణం అదేనా?
తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. మంగళవారమయినా అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.

తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. మంగళవారమయినా అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో తిరిగి తిరుమలకు భక్తుల రద్దీ ప్రారంభమయింది. భక్తులు కంపార్ట్ మెంట్లలో శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. దర్శనానికి గంటల సమయం పడుతుందని, భక్తులందరికీ దర్శనం కల్పిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. గత కొద్ది రోజుల నుంచి భక్తుల రద్దీ కొద్దిగా తగ్గింది. తుపాను, వర్షాల కారణంగా తగ్గిన భక్తుల రద్దీ మళ్లీ పెరగడంతో వారికి అవసరమైన ఏర్పాట్లను టీటీడీ చేస్తుంది.
భారీగా విరాళాలు...
తిరుమలకు భక్తులు ఇటీవల కాలంలో ఎక్కువ మంది తరలి వస్తున్నారు. ఏడుకొండల వాడికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. హుండీ కానుకలు కూడా టీటీడీకి భారీగానే అందుతున్నాయి. శ్రీవారికి వెండి గంగాళం విరాళం భక్తుడు సమర్పించాడు. హైదరాబాద్ కు చెందిన జక్కారెడ్డి శ్రీనివాసులు రెడ్డి అనే భక్తుడు తిరుమల శ్రీవారికి మంగళవారం ఉదయం 30 లక్షలు విలువైన 22 కేజీల వెండి గంగాళాన్ని విరాళంగా అందించారు. ఈ మేరకు శ్రీవారి ఆలయం ముందు ఆలయ అధికారులకు గంగాళాన్ని అందజేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
హుండీ ఆదాయం...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని పదహారు కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ఈ ఉదయం ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు నాలుగు గంటలకుపైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 66,322 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 26,000 మంది భక్తులు తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.74 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

