Fri Dec 05 2025 09:47:29 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala: తిరుమల వెళ్లే వారికి గుడ్ న్యూస్.. నేటి భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమలలో నేడు భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. సోమవారం కావడంతో భక్తుల రద్దీ పెద్దగా లేదు.

తిరుమలలో నేడు భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. సోమవారం కావడంతో భక్తుల రద్దీ పెద్దగా లేదు. నిన్నటి నుంచి తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. నిన్న నేరుగా స్వామి వారిని భక్తులు దర్శించుకున్నారు. నేడు కూడా భక్తుల రద్దీ అంతగా లేదు. దీంతో స్వామి వారిని దర్శించుకనేందుకు గంటల తరబడి వేచి చూడకుండానే స్వామి వారిని దర్శించుకుంటున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. అయితే భాద్రపద మాసం ప్రారంభం కావడంతో కొంత రద్దీ తగ్గిందని టీటీడీ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ముందుగా టిక్కెట్లు బుక్ చేసుకున్న వారు మాత్రం తిరుమలకు వచ్చి స్వామి వారికి మొక్కులు చెల్లించుకుంటున్నారని అధికారులు తెలిపారు.
నేడు శ్రీవారి టికెట్లు విడుదల...
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. నవంబర్ నెలకు సంబంధించి శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఈరోజు ఉదయం10 గంటలకు విడుదల కానున్నాయి.ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు అదే నెలకు సంబంధించిన వసతి గృహాల బుకింగ్ కూడా ఓపెన్ కానుంది. మొన్న వృద్ధులు, దివ్యాంగుల కోటా టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. భక్తులు దళారులను నమ్మవద్దని, ttdevasthanams.ap.gov.in వైబ్ సైట్ లో యాప్ లోనే బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు తెలిపారు. దళారులు తాము టిక్కెట్లు ఇప్పిస్తామని చెప్పినా నమ్మవద్దని, ఆన్ లైన్ లో మాత్రమే నవంబర్ నెలకు సంబంధించి టిక్కెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.
నాలుగు కంపార్ట్ మెంట్లలోనే...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని నాలుగు కంపార్ట్ మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం భక్తులు వేచి చూస్తున్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఆరు నుంచి ఎనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు నాలుగు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 72,119 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 25,294 మంది భక్తుల తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.02 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

