Fri Dec 05 2025 12:45:23 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలకు వెళుతున్నారా? అయితే దర్శన ఎంత సమయమో తెలుసా?
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. గురువారం కావడంతో భక్తుల రద్దీ పెద్దగా లేదనే చెప్పాలి

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. గురువారం కావడంతో భక్తుల రద్దీ పెద్దగా లేదనే చెప్పాలి. సాధారణంగా శుక్ర, శని, ఆదివారాలు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. కానీ గత కొద్ది రోజుల నుంచి తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగానే ఉంది. అనేక కారణాలతో తిరుమలకు భక్తుల తాకిడి తగ్గిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. భారీ వర్షాల హెచ్చరికలతో పాటు వరసగా పండగలు రావడంతో తిరుమలకు పెద్ద సంఖ్యలో ఆశించినంత మేరకు భక్తులు రావడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.
దసరా బ్రహ్మోత్సవాలకు...
తిరుమల ఎప్పుడు భక్తుల రద్దీతో సందడిగా ఉంటుంది. ఎంత లేదన్నా దర్శనానికి చాలా సమయం పడుతుంది. అలాంటిది గత వారం రోజుల నుంచి భక్తులు తక్కువ సంఖ్యలో వస్తుండటంతో వెంకటేశ్వరస్వామి దర్శనం సులువుగానే పూర్తవుతుందని టీటీడీ అధికారులు చెబుతున్నారు. మళ్లీ దసరా సెలవులు వస్తుండటంతో తిరుమలకు భక్తుల రద్దీ బాగా పెరుగుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. దసరాకు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. వివిధ రకాల వాహనాలపై స్వామివారి దర్శనం కలుగుతుందని భావించి అప్పుడు ఎక్కువగా భక్తుల వస్తారు.
తొమ్మిది కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని తొమ్మిది కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది నుంచి పన్నెండు గంటల సమయ పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటలకుపైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమలకు 70,472 మంది భక్తులు చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 25,247 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.85 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
Next Story

