Fri Dec 05 2025 19:53:31 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. అయితే శనివారంకావడంతో భక్తుల సంఖ్య ఎక్కువవుతుందని అధికారులు చెబుతున్నారు

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. అయితే శనివారంకావడంతో భక్తుల సంఖ్య ఎక్కువవుతుందని అధికారులు చెబుతున్నారు. ఈరోజు ఉదయం కొంత సాధారణంగానే కనపడుతున్నప్పటికీ మధ్యాహ్న సమాయానికి రద్దీ మరింత పెరిగే అవకాశముందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. సాధారణంగా శని, ఆదివారాలు తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోతాయి. రోజుకు ఎనభై వేల మందికి పైగా భక్తులు శ్రీవారిని దర్శించుకుంటారని అధికారులు తెలిపారు.
ఆదాయం పెరిగి...
తిరుమలలో శ్రీవారి హుండీ ఆదాయంతో పాటు లడ్డూ విక్రయాలు కూడా గత మూడు నెలల నుంచి భారీగా పెరిగాయని టీటీడీ అధికారులు తెలిపారు. మే నెల నుంచి ప్రారంభమయిన తిరుమలలో రద్దీ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయినా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అన్నదానం విషయంలోనూ, స్వామి వారి దర్శనం విషయంలోనూ తగిన చర్యలు తీసుకుంటున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఏపీతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు కూడా తిరుమలకు చేరుకుంటుండటంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.
పథ్నాలుగు కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని పథ్నాలుగు కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 72,067 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 25,212 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.75 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

