Fri Dec 05 2025 19:32:29 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : మంగళవారమయినా.. ఇదేమి రద్దీ గోవిందా?
తిరుమలలో భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గలేదు. మంగళవారం అయినా భక్తులు అధిక సంఖ్యలో తిరుమల శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు

తిరుమలలో భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గలేదు. మంగళవారం అయినా భక్తులు అధిక సంఖ్యలో తిరుమల శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. తిరుమలోని అన్ని వీధులు భక్తులతో నిండిపోయాయి. గోవింద నామస్మరణలతో పురవీధులు మారుమోగిపోతున్నాయి. తిరుమలలోని తలనీలాలను సమర్పించే చోట కూడా రద్దీ అధికంగా ఉంది. ఎక్కువ మంది భక్తులు తమ మొక్కులు తీర్చుకునేందుకు తిరుమలకు తరలి రావడంతో వసతి గృహాలు కూడా ఆలస్యంగా లభిస్తున్నాయి. వసతి గృహాల కోసం గంటల సేపు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
రద్దీ ఎక్కువ కావడంతో...
తిరుమలకు మార్చి నెలలో భక్తుల రద్దీ తక్కువగానే ఉంటుంది. అయితే పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఎక్కువ మంది భక్తులు తరలి వస్తున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. శుభకార్యాలు చేసుకుని ఏడుకొండల వాడిని దర్శించుకునేందుకు బారులు తీరుతున్నారు. అయితే తిరుమలలోని కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ చర్యలు తీసుకుంటుంది. కంపార్ట్ మెంట్లలో వేసవి తీవ్రత తగలకుండా తగిన ఏర్పాట్లు చేస్తుంది. నిరంతరం మంచినీరు, మజ్జిగలను భక్తులకు పంపిణీ చేసింది.
పదమూడు కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని పదమూడు కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లో కి ఉదయం ఏడున్నర గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం నాలుగు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 69,746 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 23,649 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.27 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

