Fri Dec 05 2025 12:45:12 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన రద్దీ.. రీజన్ ఇదేనా?
తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ అధికంగా ఉంది.

తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ అధికంగా ఉంది. నిన్నటి వరకూ కంపార్ట్ మెంట్ల వరకే ఉన్న భక్తులు నేడు అవి పూర్తిగా నిండిపోయి బయట వరకూ క్యూ లైన్ విస్తరించింది. గత ఆరు రోజుల నుంచి భక్తుల రద్దీ తిరుమలలో అంతంత మాత్రంగానే ఉంది. శుక్రవారం కావడంతో ఈరోజు నుంచి మళ్లీ భక్తుల రద్దీ పెరిగే అవకాశముంది. మరొక వైపు రేపు మధ్యాహ్నం నుంచి ఎల్లుండి మధ్యాహ్నం వరకూ సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా ఆలయాన్ని మూసివేయనున్నారు. దీంతో నేడు తిరుమలకు భక్తుల రద్దీ పెరిగింది.
గత నెలలో కోటి మందికి పైగా...
తిరుమలకు భక్తుల రద్దీ ఎప్పుడూ ఉంటుంది. గత పదకొండేళ్లలో ఇరవైఐదు కోట్ల మంది భక్తులు తిరుమలను దర్శించుకున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఈ ఆగస్టు నెలలోనే కోటి ఇరవై ఐదు లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. రోజుకు ఎనభై వేల మందికిపైగా భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మూడో వైకుంఠం కాంప్లెక్స్ ను నిర్మించాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది. నేడు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో అవసరమైన అన్ని చర్యలు టీటీడీ అధికారులు తీసుకుంటున్నారు.
అన్ని కంపార్ట్ మెంట్లు నిండి...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బయట కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకూ భక్తుల క్యూ లైన్ విస్తరించింది. రెండు నుంచి మూడు కిలోమీటర్ల మేరకు క్యూ లైన్ ఉంది. ఈరోజు ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఏడు నుంచి ఎనిమిది గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి ఐదు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 59,834 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 24,628 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.49 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

