Fri Dec 05 2025 21:18:26 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : ఆదివారం.. భక్తులతో కొండ నిండిపోగా...దర్శన సమయం ఎంతంటే?
తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది

తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. వరస సెలవులు రావడంతో పాటు పరీక్ష ఫలితాలు వెలువడటంతో అత్యధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలి వస్తున్నారు. కంపార్ట్ మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. దర్శనానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది. అయితే వేసవి తీవ్రత ఎక్కువగా పెరగడం, భక్తుల రద్దీ కూడా అంతకు మించి ఎక్కువగా ఉండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భక్తులు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
సిఫార్సు లేఖలు రద్దు...
వేసవి సెలవుల్లో తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకునే భక్తుల తాకిడి ఎక్కువగా ఉండనున్న నేపథ్యంలో వీఐపీ, సిఫార్సు లేఖలపై దర్శనాలు రద్దు చేయాలనే నిర్ణయం తీసుకుంటున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. మే, జూన్ రెండు నెలలపాటు సెలవుల కారణంగా కుటుంబాలతో తిరుపతికి వచ్చేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని, భక్తులు ఇబ్బందులు పడకూడడనే ఉద్దేశంతోనే మే 1 నుంచి జూన్ 30 వరకు వీఐపీ దర్శనాలతో పాటు సిఫార్సు లేఖలపై సేవలు, బ్రేక్ దర్శనాలు, సుప్రభాతం దర్శనాలు రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కాలంలో సాధారణ భక్తులకు దర్శనం కల్పించేందుకు వీలుగా, వీఐపి బ్రేక్ దర్శనాలు, విఐపి సేవలు, శుభదం దర్శనాలు కూడా రద్దు చేశారు. ఈ సమయంలోతిరుమలకు వచ్చే భక్తులందరూ క్యూ లైన్ల ద్వారా శ్రీవారిని దర్శించుకునే వీలు కల్పించారు.
31 కంపార్ట్ మెంట్లలో...
నేడు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 82,811 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 34,913 భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.24 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.
Next Story

